ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై వేటు?

July 27, 2022


img

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఏ క్షణంలోనైనా కాంగ్రెస్‌ అధిష్టానం బహిష్కరణ వేటువేయబోతున్నట్లు తాజా సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్కం ఠాగూర్ ఆయన సోదరుడు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సహా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో ఇదే అంశంపై మాట్లాడుతున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించడానికి సిద్దంగా ఉందని తెలుస్తోంది. 

ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి రావడం, రాష్ట్రంలో బిజెపి మాత్రమే టిఆర్ఎస్‌కు ప్రత్నాయమని చెప్పడం, కాంగ్రెస్‌ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తుండటం వంటి పార్టీ వ్యతిరేక చర్యల కారణంగా ఆయనపై వేటు వేయబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఆయన ఇప్పటికే బిజెపిలో చేరేందుకు మూటముల్లె సర్దుకొని సిద్దంగా ఉన్నారు. కనుక కాంగ్రెస్‌ పార్టీ వేటు వేయగానే బిజెపిలో చేరిపోవడం ఖాయం. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరబోతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు స్పీకరు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజగోపాల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తాను పార్టీ వీడితే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని రాజగోపాల్‌రెడ్డి సూచన ప్రాయంగా చెప్పారు. కనుక ఆయనపై అనర్హత వేటు వేసినా, రాజీనామా చేసినా మునుగోడు ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది.


Related Post