రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నలుగురు మైనర్ నిందితులకు జువైనల్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సకాలంలో బెయిల్ ఉత్తర్వులు జువైనల్ హోమ్ నిర్వాహకులకు చేరడంతో వారిలో ముగ్గురు జువైనల్ హోమ్ నుంచి విడుదలై నిన్ననే ఇళ్ళకు చేరుకొన్నారు. బెయిల్ మంజూరైన 4వ బాలుడు కూడా ఈ రోజు విడుదలకానున్నాడు. ఇదే కేసులో 5వ నిందితుడుగా ఉన్న మరో మైనర్ బాలుడు బెయిల్ పిటిషన్‌పై నేడు జువైనల్ కోర్టు విచారణ చేపట్టనుంది. బహుశః అతనికి కూడా నేడు బెయిల్ లభించడం ఖాయమనే భావించవచ్చు.
ఈ కేసులో నిందితులందరూ రాజకీయ పలుకుబడి ఉన్ననాయకుల పిల్లలు కనుక వారిని కేసులో నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ధర్నాలు చేశాయి. పోలీసులు నిందితులను అదుపులో తీసుకొని వారిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు పంపించారు.
ఇంత హేయమైన నేరానికి పాల్పడిన ఆ మైనర్ బాలురు ఏమాత్రం పశ్చాత్తాప పడలేదు. తమపై కటినమైన సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయని దిగులు పడలేదు. రాజకీయ పలుకుబడి ఉన్న తమ తల్లితండ్రులు తమను సులువుగా విడిపించుకు తీసుకుపోతారని గట్టి నమ్మకం వ్యక్తం చేసేవారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. బెయిల్‌పై విడిపించుకొని తీసుకుపోయారు.
ఇక నుంచి వారి తల్లితండ్రులు ఈ కేసును ఏళ్ళ తరబడి న్యాయస్థానాలలో సాగదీస్తూ పిల్లలకు శిక్ష పడకుండా తప్పిస్తారని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈ సామూహిక అత్యాచారం కేసు ఇక ముగిసినట్లే భావించవచ్చు. ఇంత పలుకుబడి కలిగిన వారిపై ఈ కేసు పెట్టినందుకు ఇప్పుడు బాధితురాలే చాలా ప్రమాదంలో ఉన్నట్లు భావించవచ్చు.