మొదట ఐదేళ్ళు కేంద్ర ప్రభుత్వంతో చాలా సఖ్యతగా ఉన్న సిఎం కేసీఆర్ ఇపుడు దాంతో ఎందుకు యుద్ధం చేస్తున్నారు? అనే ప్రశ్నకు రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి కళ్ళకు కనిపిస్తోంది రెండోది కనబడదు.
రాష్ట్రంలో బిజెపి బలపడుతూ వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుండటం. ఇది స్పష్టంగా కంటికి కనబడుతోంది.
బహుశః అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా అప్పులు పుట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూండటం రెండో కారణమై ఉండవచ్చు. సిఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇదే అంశంపై మంగళవారం అర్దరాత్రి వరకు చర్చలు జరపడం గమనిస్తే కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహానికి ఇదే కారణమని అర్దమవుతోంది.
తెలంగాణలో ఎప్పటికే టిఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉండాలని, తన తదుపరి తన కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయాలని సిఎం కేసీఆర్ భావిస్తున్న సంగతి తెలిసిందే. బిజెపి దానికి అడ్డుపడుతూ దూసుకువస్తుండటంతో, బిజెపి వలన రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం ఉండదని నిరూపించేందుకు సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసుకొని యుద్ధం ప్రారంభించారని చెప్పవచ్చు.
ఇదివరకు రాష్ట్రాలలో వివిద ప్రభుత్వ కార్పొరేషన్లు చేసే అప్పులను పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని రుణ పరిమితి (ఎఫ్‌ఆర్‌బీఎం)ని నిర్ణయించేది. కనుక రుణ పరిమితికి మించి అప్పుల కోసం గత కొంతకాలంగా చాలా రాష్ట్రాలు తమ అధీనంలో ఉండే కార్పొరేషన్లను అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అప్పులు తెచ్చుకొంటున్నాయి.
ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి కార్పొరేషన్ల ద్వారా చేస్తున్న అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణించి రుణ పరిమితిని నిర్ణయిస్తామని, ఆ మేరకు రుణ పరిమితిని తగ్గిస్తామని ప్రకటించింది. అప్పులకు అడ్డుకట్టవేయకపోతే భారత్ కూడా శ్రీలంకలా దివాళా తీయవచ్చని ఆర్ధిక నిపుణుల హెచ్చరికల వలన కావచ్చు లేదా తెలంగాణ వంటి రాష్ట్రాలలో బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు కేంద్ర ప్రభుత్వం అప్పులపై ఆంక్షలు విధిస్తోంది.
ముఖ్యంగా మోడీని గద్దె దించుతానని సిఎం కేసీఆర్ శపధాలు చేస్తూ, ఆ దిశలో ప్రయత్నాలు చేస్తున్నందున తెలంగాణ ప్రభుత్వానికి కొత్త అప్పులు పుట్టకుండా ఆంక్షలు విధించింది. ఎప్పటికప్పుడు కొత్త అప్పులు పుట్టకపోతే టిఆర్ఎస్ ప్రకటించి అమలుచేస్తున్న పధకాలకు, అభివృద్ధిపనులకు, ప్రభుత్వ నిర్వహణకు చివరికి జీతాల చెల్లింపులకి కూడా ఇబ్బందులు తప్పవు. కనుక కేంద్రంపై సిఎం కేసీఆర్ ఆగ్రహానికి ఇదీ ఓ కారణమని స్పష్టమవుతోంది.