తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్‌కే పరిమితం కావాలని, రాష్ట్రంలో టిఆర్ఎస్ తప్ప వేరే పార్టీలు ఉండకూడదని సిఎం కేసీఆర్ భావిస్తుంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యం కాదని అందరికీ తెలుసు. సిఎం కేసీఆర్ ఏది వద్దని కోరుకొంటున్నారో సరిగ్గా అదే జరుగుతోంది. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్‌లు కాకుండా చిన్నా పెద్ద పార్టీలన్నీ కలిపి ఓ డజను వరకు ఉన్నాయి. దాదాపు అన్ని పార్టీలు కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని చెపుతున్నాయి.
ఇక గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అప్పుడప్పుడు రాజ్ భవన్‌లో ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజాసమస్యలపై స్పందిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన తరువాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “భద్రాచలంలో ముంపు ప్రాంతాలను సందర్శించి వరద బాధితులను పరామర్చించడం వెనుక ఎటువంటి రాజకీయాలు లేవు. నేను దత్తత తీసుకొన్న గ్రామాలు నీట మునిగినందున వెళ్ళి వారిని పరామర్శించాను. రాష్ట్రంలో వరద భీభత్సంపై కేంద్రానికి నివేదిక ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి నిధులు విడుదల చేసింది. ఆ వివరాలు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వద్ద ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం వాటితో వరద బాధితులను ఆదుకొంటుందని నేను భావిస్తున్నాను.
ఇటీవల సిఎం కేసీఆర్ రాజ్ భవన్‌కి వచ్చి వెళ్ళిన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడలేదు. రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మద్య దూరం అలాగే ఉంది. కనుక ప్రతీసారి ప్రోటోకాల్, హెలికాఫ్టర్ గురించి అడిగి లేదనిపించుకోదలచుకోలేదు. నా ఏర్పాట్లు నేను చేసుకొంటున్నాను.
నాకున్న రాజకీయ పరిజ్ఞానం మేరకు సిఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్తారని నేను భావించడం లేదు. అలాగే జాతీయ రాజకీయాలలో కూడా ఇప్పుడే ప్రవేశించకపోవచ్చు,” అని అన్నారు.
గవర్నర్ రాజ్ భవన్‌కే పరిమితం కావాలని సిఎం కేసీఆర్ కోరుకొంటుంటే ఆమె రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని స్పందిస్తున్నారు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండాలని సిఎం కేసీఆర్ కోరుకొంటుంటే ఆమె రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. కనుక రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు మద్య దూరం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గకపోవచ్చు.