కాంగ్రెస్‌ అధిష్టానం నా హెచ్చరికలను పట్టించుకోలేదు

July 25, 2022


img

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్దమవుతుండటంతో, ఆయనను బుజ్జగించేందుకు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈరోజు ఆయన నివాసానికి వచ్చారు. ఇరువురూ చాలాసేపు చర్చించిన తరువాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, “మాది కాంగ్రెస్‌ కుటుంబం. రాజగోపాల్ రెడ్డికి సోనియా, రాహుల్ గాంధీలన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా చాలా అభిమానం. ఆయన పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తప్ప పార్టీ మారుతారని నేను అనుకోవడం లేదు. అయినప్పటికీ తొందరపడవద్దని చెప్పాను. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం నాకుంది,” అని అన్నారు. 

అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన వైఖరికే కట్టుబడినట్లు ఆయన మాటలతో అర్దమవుతుంది. “కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి ఎటువంటి ప్రాధాన్యం, పదవులు, గౌరవం లభించడం లేదు. బయట నుంచి వచ్చినవారికే పదవులు దక్కుతున్నాయి. నాకు కనీసం సీఎల్పీ పదవి ఇవ్వాలని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. పార్టీ నుంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయినా మా అధిష్టానం వైఖరిలో మార్పు రాలేదు. 

ఇదే విదంగా నిర్లిప్తంగా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, కాంగ్రెస్‌ స్థానంలో బిజెపి ప్రవేశించి బలపడుతుందని పలుమార్లు హెచ్చరించాను. నా హెచ్చరికలను పార్టీ వ్యతిరేకతగా భావించారే తప్ప నేను చెపుతున్న విషయంలో తీవ్రతను గమనించనే లేదు. చివరికి నేను చెప్పినట్లుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి బిజెపి బలపడింది. అదే ఇప్పుడు సిఎం కేసీఆర్‌ను ఢీకొని ఓడించేందుకు ప్రయత్నిస్తోంది. 

ఈటల రాజేందర్‌కు కూడా బిజెపి అండగా నిలబడింది కనుక ఆయన హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ను ధైర్యంగా ఢీకొని విజయం సాధించగలిగారు. అందుకే ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌తోనే పోటీ పడేందుకు సిద్దం అంటున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల విషయంలో నేను కన్ఫ్యూజన్‌లో లేను పూర్తి క్లారిటీతోనే ఉన్నాను. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించగలిగే శక్తి బిజెపికి మాత్రమే ఉంది,” అని అన్నారు.


Related Post