టిఆర్ఎస్‌-బిజెపి ఫ్రెండ్లీ ఫైట్స్... సీతక్క సెటైర్

July 25, 2022


img

ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మారుమూల గ్రామాలలో ప్రజలకు బాసటగా నిలుస్తుండటమే కాక రాజకీయాలలో కూడా చాలా చురుకుగా ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధాల గురించి ఆమె ట్విట్టర్‌లో పెట్టిన ఓ వీడియోతో తన అభిప్రాయాన్ని చాలా చక్కగా వివరించారు. 

దానిలో ఒక గొర్రె పొట్టేలు దున్నను ఢీకొనేందుకు వెనక్కు వెళ్ళి వేగంగా దూసుకువచ్చి దున్న తలను సున్నితంగా ఢీకొంటుంది. దున్న కూడా పొట్టేలును ఢీకొనేందుకు సిద్దం అన్నట్లు తలవంచి నిలబడుతుంది కానీ ఉన్నచోట నుంచి కదలదు. అడుగు ముందుకు వేయదు. 

అలాగే టిఆర్ఎస్‌, బిజెపిలు కూడా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు పరస్పరవిమర్శలు చేసుకొంటూ ఉత్తుత్తి యుద్ధం చేసుకొంటున్నాయని సీతక్క చెప్పకనే చెప్పారు. దీనిలో పొట్టేలును టిఆర్ఎస్‌ అనుకొంటే, దాని కంటే పదింతలు శక్తి కలిగిన దున్నను కేంద్ర ప్రభుత్వంగా భావించవచ్చు. 

పొట్టేలు యుద్ధానికి సై అంటూ ఢీ కొంటున్నప్పటికీ, దున్న కదలకుండా పొట్టేలును చూస్తుండిపోవడం అంటే కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి చిట్టా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పదేపదే బెదిరిస్తుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెపుతున్నట్లే భావించవచ్చు. కనుక దున్న,పొట్టేలు ఉత్తుత్తి పోరాటంలాగే టిఆర్ఎస్‌, బిజెపిలు కూడా ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని సీతక్క చెప్పినట్లు భావించవచ్చు. 


Related Post