నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరేందుకు బ్యాగ్ సర్దుకొంటున్నారా? అంటే అవుననుకోవాల్సి ఉంటుంది.
ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకొంది. వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ని బిజెపి ఓడించడం, కేసీఆర్‌ను గద్దె దించి ఫామ్‌హౌసుకి పంపించడం రెండూ ఖాయమే. నేను మొదటి నుంచి కేసీఆర్‌ను గద్దె దించే పార్టీలో ఉందామని భావిస్తున్నాను. నేను ఏమి చేయబోతున్నానో త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తాను,” అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బిజెపికి అనుకూలంగా మాట్లాడటం ద్వారా తాను ఆ పార్టీలో చేరబోతునట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగానే చెప్పారనుకోవచ్చు. అయితే ఎప్పుడనేది ఇంకా తెలియవలసి ఉంది.
నిజానికి ఆయన ఏడాదిన్నర క్రితమే కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరేందుకు సిద్దపడ్డారు. కానీ అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందనో లేదా వేరే కారణం చేతో వెనక్కు తగ్గారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇంకా ఆలస్యం చేస్తే ఆ పార్టీలో కుదురుకొని పట్టుసాధించడం కష్టం అవుతుందనే ఆలోచనతో ఇప్పుడు బిజెపిలో చేరేందుకు సిద్దం అవుతున్నట్లున్నారు.