రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ఊహించినట్లే ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్ము భారీ మెజార్టీతో విజయం సాధించారు. గిరిజనురాలైన ఆమెను అభ్యర్ధిగా ఎంచుకోవడంతోనే ఎన్డీయే సగం విజయం సాధించిందని చెప్పవచ్చు. ఎవరూ వేలెత్తి చూపలేని ఆమెను ఎంచుకోవడంతో విపక్షాలు కూడా ఆమె అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి కల్పించింది బిజెపి. ఒకవేళ ఆమె స్థానంలో వేరెవరిని అభ్యర్ధిగా నిలిపినా కూడా ఏపీలో వైసీపీ, ఒడిశాలోని బిజేడి, తమిళనాడులోని అన్నాడీఎంకె తదితర పార్టీల మద్దతుతో అవలీలగా గెలిపించుకోగలిగేదని కేసీఆర్‌కి కూడా తెలుసు.
కానీ బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ పట్ల తన వ్యతిరేకతను తెలియజేసేందుకే యశ్వంత్ సిన్హా ఓడిపోతారని తెలిసినా కేసీఆర్ ఆయనకు మద్దతు ఇచ్చారని చెప్పవచ్చు. కనుక ఈ ఒక్క విషయంలో సిఎం కేసీఆర్ తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పినట్లుగానే భావించవచ్చు.
అయితే కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికతో ఇంతకుమించి చాలా ఆశించారు. విపక్షాలన్నిటినీ కూడగట్టి వాటిని తన నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్ళాలనుకొన్నారు. కానీ విపక్ష అభ్యర్ధి ఎంపికలో కాంగ్రెస్ పార్టీని కూడా భాగస్వామిగా చేయడంతో కేసీఆరే దూరంగా ఉండిపోవలసి వచ్చింది. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు ప్రక్రియలో మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్ ఎంపీలను పంపించినప్పుడు వారు రాహుల్ గాంధీ తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొనవలసి వచ్చింది. అంటే కేసీఆర్ ఎంత వద్దనుకొన్నా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయకతప్పలేదన్న మాట!
ఒకవేళ ఈ ఎన్నికలో యశ్వంత్ సిన్హా గెలిచినా కేసీఆర్‌కి కొంత తృప్తి కలిగి ఉండేది. కానీ ద్రౌపదీ ముర్ము భారీ మెజార్టీతో గెలవడంతో అదీ దక్కలేదు. కనుక రాష్ట్రపతి ఎన్నికతో సిఎం కేసీఆర్ ఏదో సాధిద్దామని భావిస్తే మరొకటి జరిగింది. అంతేకాదు.. ద్రౌపదీ ముర్ము భారీ మెజార్టీతో విజయం సాధించడంతో రాష్ట్రంలో బిజెపి మరింత ఉత్సాహంగా ఉంది. జాతీయ స్థాయిలో కూడా బిజెపి దీనిని తన విజయంగా వర్ణించుకొంటోంది. కనుక బిజెపిని ఢీకొని కేసీఆర్ మరోసారి ఓడిపోయినట్లే భావించవచ్చు.