పోలవరంపై పేచీ... ఐదు గ్రామాల విలీనం ఇప్పుడు ఎందుకు?

July 20, 2022


img

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పంపు హౌసులు నీట మునిగాయి. భద్రాచలం పట్టణంలోకి నీళ్ళు వచ్చాయి. రెండు పంపుహౌసులు నీట మునగడంతో వందల కోట్ల నష్టం కలిగింది. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు దాని గురించి మాట్లాడకుండా పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వలన భద్రాచలం పట్టణంలోకి నీళ్ళు వచ్చాయని కనుక ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పంపుహౌసులు నీట మునగడం, భద్రాచలం పట్టణంలోకి నీళ్ళు రావడం రెంటిలో ఏది ప్రాధాన్యమైనదని ఆలోచిస్తే మొదటిదే అని అర్దమవుతుంది. పంపుహౌసులలో నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడిపోసి, నీళ్ళలో మునిగి ఉన్న మోటర్లకు మరమత్తులు చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి సిద్దం చేసుకోవాలి. కానీ ఆపని ముందు చేయకుండా భద్రాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్న ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఆ ప్రాంతాలలో కరకట్టల ఎత్తు పెంచడానికి సిఎం కేసీఆర్‌ తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేశారని చెపుతున్నారు. కనుక ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయడానికి, కరకట్టాల ఎత్తు పెంచడానికి సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని సిఎం కేసీఆర్‌తో చర్చించాలని టిఆర్ఎస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు.

సిఎం కేసీఆర్‌కు ఇంజనీరింగ్ డిగ్రీ, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన లేకపోయినా పంపుహౌసులను సొంతంగా డిజైన్ చేయించి నిర్మించడం వలననే అవి నీట మునిగాయంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో ఆయన ‘క్లౌడ్ బరస్ట్’ విదేశీ కుట్ర అంటూ మాట్లాడి మరింత నవ్వులపాలయ్యారు. కనుక ఈ అంశం మీద నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే పోలవరం, ఐదు గ్రామాల విలీనం, భద్రాద్రి రాముడిని కాపాడటం అంటూ మాట్లాడుతున్నట్లు చెప్పవచ్చు. 

వారు చేస్తున్న డిమాండ్స్ సాధ్యం కావని అందరికీ తెలుసు. ఒకవేళ సాధ్యపడినా దానికి చాలా సుదీర్గమైన ప్రక్రియ ఉంటుంది కనుక చాలా సమయం పడుతుందని తెలుసు. కానీ ఇప్పటికిప్పుడు ఐదు గ్రామాలను ఇచ్చేస్తే కరకట్టల ఎత్తు పెంచి భద్రాద్రి రాముడిని కాపాడుతామని టిఆర్ఎస్‌ నేతలు చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయినా ఏపీలో ఉన్న ఐదు గ్రామాలలో కరకట్టల ఎత్తు పెంచేందుకు సిఎం కేసీఆర్‌ రూ.1,000 కోట్లు నిధులు విడుదల చేయడం ఏమిటి?కరకట్టల ఎత్తు పెంచడమే ముఖ్యం అనుకొంటే ఆ సొమ్మును ఏపీ ప్రభుత్వానికి ఇచ్చేస్తారా? 

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి టిఆర్ఎస్‌ నేతలు అనవసరంగా గొప్పలు చెప్పుకోవడం వలననే ఇప్పుడు నీట మునిగిన పంపు హౌసుల గురించి ప్రతిపక్షాల విమర్శలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారని చెప్పక తప్పదు.


Related Post