ఇటీవల టిఆర్ఎస్‌ను నుంచి బయటకు వస్తున్నవారు బిజెపిని కాదని కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇటీవల వెలువడిన రెండు ప్రైవేట్ సర్వే నివేదికలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్‌కు కొన్ని సీట్లు తగ్గినప్పటికీ రాష్ట్రంలో మళ్ళీ ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని తేల్చి చెప్పాయి.
అయినా కూడా టిఆర్ఎస్‌ను వీడే నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం చాలా ఆసక్తికరం. అంటే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని నమ్మి వారు పార్టీలో చేరుతున్నట్లు భావించవచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలందించబోతున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ గెలుపుకి తోడ్పడుతున్న సంగతి తెలిసిందే. అపర చాణక్యుడని పేరున్న సిఎం కేసీఆర్‌కు దేశంలో అనేక రాజకీయ పార్టీలను ఎన్నికలలో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ తోడయితే రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ టిఆర్ఎస్‌ను వీడే నేతలు బిజెపిని కాదని కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరుతున్నారు? అనే సందేహం కలుగుతుంది.
రాష్ట్రంలో టిఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది కనుక సహజంగానే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అయితే మతరాజకీయాలు చేసే బిజెపి కంటే అందరినీ కలుపుకుపోయే లౌకికవాద కాంగ్రెస్ పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపవచ్చనే అంచనాతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండవచ్చు. గత పిసిసి అధ్యక్షులకు భిన్నంగా రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఢీకొంటుండటం, ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణ మద్దతు ఇస్తుండటం టిఆర్ఎస్‌ను వీడే నేతలు కాంగ్రెస్‌ను ఎంచుకోవడానికి మరో కారణంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఈ అంచనాలు నిజమే అని భావించవచ్చు.