మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో వందల గ్రామాలు, వేల ఎకరాలు నీట మునిగాయి. అనేక రహదారులు దెబ్బ తిన్నాయి. తెలంగాణ రాష్ట్రాని వరప్రదాయినిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష్మీ, సరస్వతి పంపుహౌసులు నీట మునిగాయి. మరోపక్క రైస్ మిల్లులలో నిలువ ఉంచిన లక్షల టన్నుల ధాన్యం వర్షాలకి తడిసి మొలకలు వచ్చేస్తున్నాయి.
వీటన్నిటితో తెలంగాణ రాష్ట్రానికి వేలకోట్లు నష్టం వాటిల్లిందని అర్దమవుతూనే ఉంది. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఉపద్రవాన్ని కళ్ళారా చూస్తున్న రాష్ట్రంలో బిజెపి నేతలైనా జరిగిన నష్టం గురించి మాట్లాడటం లేదు. కేంద్రంతో మాట్లాడి తక్షణ సహాయం సాధిస్తామని చెప్పడం లేదు. ఎంతసేపూ వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని లేదా నీట మునిగిన పంపుహౌసులతో జరిగిన నష్టానికి కేసీఆర్‌ను బాధ్యుడిని చేసి విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ఇటువంటి కష్టకాలంలో కూడా రాష్ట్ర బిజెపి నేతలు ప్రత్యర్ధి పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి ఎలా ఆకర్షించాలి? టిఆర్ఎస్ పార్టీని ఏవిదంగా దెబ్బ తీయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్రం పరిస్థితి... వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించడం లేదు. వారికి ఎంతసేపూ తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి... వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేయాలనే యావే తప్ప ప్రజల సమస్యలతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇటువంటి కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనే టిఆర్ఎస్ వాదన నిజమనిపిస్తుంది. తెలంగాణ ప్రజలకు ఇటువంటి కష్టకాలంలో సాయపడనప్పుడు వారు బిజెపికి ఎందుకు ఓట్లు వేయాలి? ఎందుకు అధికారం కట్టబెట్టాలి?అని బిజెపి నేతలు ఆలోచించుకొంటే మంచిది.