మహిళలు ఉద్యోగాలకి రావద్దు: తాలిబన్ హుకుం

July 18, 2022


img

ఆఫ్ఘనిస్తాన్‌లో  తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అక్కడి మహిళల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. దేశ ఆర్ధిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తుండటంతో ప్రభుత్వ శాఖలలో పనిచేసే మహిళా ఉద్యోగుల జీతాలు మూడొంతులు తగ్గించేసింది. అదేమంటే ‘ఉద్యోగం అవసరమనుకొంటే చేయొచ్చు లేకుంటే ఇంటికి పోవచ్చనే’ సమాధానం అధికారుల నుంచి వినబడుతోంది. ఆ ఉద్యోగం కూడా లేకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందని ఎంత ఇస్తే అంతే పుచ్చుకొని పనిచేస్తున్నారు. 

అయినా కూడా మహిళలు ఇంకా ఉద్యోగాలు చేస్తుండటం నచ్చని తాలిబన్లు ఇకపై మహిళలు ఉద్యోగాలకు రానవసరంలేదని మొహం మీదే చెప్పేస్తున్నారు. ‘పని ఒత్తిడి పెరిగింది కనుక మీరు పనిచేయలేరు. మీ ఇంట్లో అర్హత ఉన్న మగవాళ్ళను కానీ లేదా మీకు తెలిసిన మగవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు బదులు వారిని డ్యూటీకి పంపించండి,’ అని చెపుతుండటంతో ఆఫ్ఘన్ మహిళా ఉద్యోగులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

గత 15 ఏళ్లుగా ఆర్ధికశాఖలో పనిచేస్తున్న ఓ మహిళ ఇప్పుడు తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేందుకు ప్రయత్నిస్తే తాలిబాన్ మూకలు వారితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ బయటకు రావాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘన్ మహిళల పరిస్తితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు, ఆదాయం లేకపోతే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది.


Related Post