సిఎం కేసీఆర్‌ క్లౌడ్ బర్స్ట్... జోకులే జోకులు

July 18, 2022


img

సిఎం కేసీఆర్‌ ఆదివారం భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పర్యటించినప్పుడు ‘క్లౌడ్ బర్స్ట్’ అని చెప్పి ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయారు.  ప్రతిపక్షాలు, నెటిజన్స్ దానిపై జోకులు, వ్యంగ్యస్త్రాలు సందిస్తుంటే టిఆర్ఎస్‌ నేతలెవరూ సమర్ధించుకోలేని పరిస్థితి ఏర్పడింది. 

ఇంతకీ సిఎం కేసీఆర్‌ ఏమన్నారంటే, “కౌడ్ బర్స్ట్ అనే కొత్త పద్దతి వచ్చింది. దాంతో ఇరుగుపొరుగు దేశాలపై అకాల వర్షాలు, భారీ వర్షాలు కురిపిస్తున్నట్లు సమాచారం. మనదేశంలో ఓ సారి లద్దాక్‌లోనూ, ఉత్తారాఖండ్ లోనూ ఈవిదంగా చేసి భారీ వర్షాలు, వరదలు సృష్టించినట్లు మనకు చూచాయగా కొంత సమాచారం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో గోదావరీ పరీవాహక ప్రాతాలలో పడుతున్న ఈ భారీవర్షాలను చూస్తుంటే ఇక్కడా క్లౌడ్ బర్స్ట్ కుట్ర జరిగినట్లు  అనుమానంగా ఉంది,” అన్నారు. 

సిఎం కేసీఆర్‌ స్వయంగా దగ్గరుండి కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేయించారని, గోదావరికి నడకలు నేర్పించారని టిఆర్ఎస్‌ నేతలు గొప్పలు చెప్పుకొనేవారు. ఇప్పుడు అదే కొంప ముంచింది. ఎగువ నుంచి వరద నీటితో మేడిగడ్డ, అన్నారం పంప్ హౌసులు మునిగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు పరీవాహక గ్రామాలు వరద నీళ్ళలో మునిగిపోవడంతో సిఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి బదులు చెప్పలేక ఇప్పుడు ఈ పాపం మాది కాదు విదేశీయులెవరో క్లౌడ్ బర్స్ట్ ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాలలో భారీ వర్షాలు పడేలా కుట్రలు చేశారని సిఎం కేసీఆర్‌ అని అనుమానం వ్యక్తం చేశారు. 

దీంతో మరోసారి సిఎం కేసీఆర్‌ మరోసారి ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయారు. వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి షర్మిల సిఎం కేసీఆర్‌ను ఎద్దేవా చేస్తూ, “ఆంద్రోళ్ళ కుట్రలైపోయాయి.... ప్రతిపక్షాల కుట్రలైపోయాయి....  తిరుగుబాటుదారుల కుట్రలు అయిపోయాయి....  కేంద్ర ప్రభుత్వం కుట్రలు కూడా అయిపోయాయి. ఇప్పుడు కేసీఆర్‌ మీద విదేశాల వాళ్ళు కూడా పగబట్టారు. పాపం ఆయనకు ఎంత కష్టమొచ్చింది?” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

బిజెపి నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందిస్తూ, “ఎగువన ఎంత వరదలు పోటెత్తినా కాళేశ్వరం ప్రాజెక్టుతో అదుపుచేసి లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొన్న సిఎం కేసీఆర్‌, ఇప్పుడు గ్రామాలను వరదలు ముంచెత్తుతుంటే విదేశీకుట్ర అంటున్నారు. క్లౌడ్ బర్స్ట్ పై సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందే,” అని వ్యంగ్యంగా అన్నారు. 

కాంగ్రెస్‌ నేతలు కూడా  ‘క్లౌడ్ బర్స్ట్’ పేరుతో సిఎం కేసీఆర్‌తో ఆడేసుకొంటున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌసులలోకి వరద నీరు చేరి నీళ్ళ మోటర్లు మునిగిపోతే, దానిని కప్పి పుచ్చుకొనేందుకు సిఎం కేసీఆర్‌ ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ అనే ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారు. నా అంత మేధావి లేదన్నట్లు మాట్లాడే కేసీఆర్‌ ఇప్పుడు తన మేదస్సులో మరికొంత మనకి పంచిపెట్టారు. వినేవాళ్ళు ఉంటే కేసీఆర్‌ ఎంతైనా చెపుతారు,” అని ఎద్దేవా చేశారు.


Related Post