నేడు పార్లమెంటులో, రాష్ట్రాల అసెంబ్లీలలో ఏకకాలంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తరువాత బ్యాలెట్ బాక్సులన్నిటినీ సాధారణ ప్రయాణికుల విమానాలలో ఢిల్లీకి తరలించి ఈ నెల 21న పార్లమెంటు హౌసులో ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 25వ తేదీన నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.
ఎన్డీయే కూటమి తరపున ద్రౌపదీ ముర్ము, విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు. వారివారి రాష్ట్ర జనాభాని బట్టి వారి ఓటు విలువ నిర్ధారించబడుతుంది. దేశంలో మొత్తం అన్ని పార్టీలవి కలిపి ఓట్ల విలువ 10,86,431 ఉండగా వాటిలో ద్రౌపదీ ముర్ముకి 6.67 లక్షలు ఉన్నాయి. అంటే సుమారు 60 శాతం పైగా ఓట్లు కూడగట్టుకొన్నారు. కనుక ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే. కానీ యశ్వంత్ సిన్హా పోటీకి దిగడం వలన నేడు ఎన్నికలు నిర్వహించవలసివస్తోంది.
భారత్‌లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి మహిళ కాగా, ఆ పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపదీ ముర్ము నిలుస్తారు.