వరద బాధితులకు ట్విట్టర్‌లో సానుభూతి... ఏం ప్రయోజనం?

July 16, 2022


img

తెలంగాణలో గత పది రోజులుగా కురిసిన, ఇంకా కురుస్తున్న వర్షాలకు వివిద జిల్లాలలో 500కి పైగా గ్రామాలు నీట మునిగాయి. గ్రామాలలో ఇళ్ళు, పంటచేలు నీట మునిగాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు నగరాలు, పట్టణాల రోడ్లు జలమయ్యాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి అవసరమైన సహాయచర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కవంటి అతికొద్ది మంది ప్రజాప్రతిధులు మాత్రం ముంపు ప్రాంతాలకు వెళ్ళి, బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. 

కానీ నేటికీ చాలామంది తమ ఇళ్ళలోనో, కార్యాలయాలలో కూర్చొని సోషల్ మీడియాలో వరద ముంపుకు గురైన ప్రాంతాల ఫోటోలు, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేసే ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సానుభూతి సందేశాలు పెడుతున్నారు. మరికొందరు నేతలు కనీసం ఆ ఆలోచన కూడా చేయకుండా రాజకీయాలలో తలమునకలై ఉన్నారు. బిజెపి మహిళా నేత విజయశాంతి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ఇందుకు ఓ చిన్న ఉదాహరణ. 


వరదలలో చిక్కుకొని ప్రజలు నానాకష్టాలు పడుతుంటే సోషల్ మీడియాలో సానుభూతి సందేశాలు పెడుతూ మొసలి కన్నీళ్ళు కార్చడం వలన ఏం ప్రయోజనం అని బాధిత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు కష్టకాలంలో ప్రజలను ఆదుకోకుండా మొహం చాటేసి తిరిగితే రేపు ఏ మొహం పెట్టుకొని వారివద్దకు వెళ్ళి ఓట్లు అడగగలరు? ఆలోచించుకోవాలి.     



Related Post