తూచ్ ముందస్తు ఎన్నికలు లేవు: కేటీఆర్‌

July 15, 2022


img

పది రోజుల క్రితమే సిఎం కేసీఆర్‌ “మేము ముందస్తు ఎన్నికలకి సిద్దం... మీరే డేట్ ఫిక్స్ చేసి ప్రకటించండి. ముందస్తు ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము బిజెపికి ఉందా?” అని భీకరంగా గర్జించారు. అది చూసి బిజెపి, కాంగ్రెస్ పార్టీలు గజగజవణికిపోయాయని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రజలకు తెలియజేసింది. కనుక సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకి సిద్దం అవుతున్నారనే అందరూ భావించారు. 

కానీ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కూడా నంబర్:2గా ఉన్న మంత్రి కేటీఆర్‌ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ, “ముందస్తు ఎన్నికలు జరుగవు. గడువు ప్రకారం 2023లోనే జరుగుతాయి. ఆ ఎన్నికలలో మళ్ళీ మేమే గెలిచి, సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. వచ్చే ఎన్నికలలో మాకు 90కి పైగా సీట్లు వస్తాయని పలు సర్వేలు స్పష్టం చేశాయి. కానీ కాంగ్రెస్‌, బిజెపిలే వాటి పరిస్థితి గురించి ఆలోచించుకోవలసి ఉంటుంది. 

అన్ని రాజకీయ పార్టీలలో మాదిరిగానే మా పార్టీలో కూడా అక్కడక్కడ నేతల మద్య గొడవలు జరుగుతున్నాయి. మా పార్టీ బలంగా ఉంది కనుకనే వారి మద్య ఆధిపత్యపోరు జరుగుతోంది. అటువంటి బలమైన నేతలందరినీ కలుపుకుపోతాము. పార్టీలో నుంచి కొంత మంది బయటకు పోతే పోతారు. వారు వెళ్ళిపోవడం వలన పార్టీపై ఒత్తిడి తగ్గుతుంది తప్ప నష్టమేమీ ఉండదు,” అని అన్నారు.

పది రోజుల క్రితం ముందస్తుకి సిద్దం అని చెప్పిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు హటాత్తుగా ఎందుకు వెనక్కు తగ్గారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టిఆర్ఎస్‌కు 8 శాతం ఓట్లు తగ్గి 38.88 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పిన ఆరా సర్వే నివేదికే కారణమా?


Related Post