హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గసమావేశాలు జరిగినప్పటి నుంచి బిజెపి-టిఆర్ఎస్ పార్టీల మద్య మాటల యుద్ధాలు ఇంకా తీవ్రమయ్యాయి. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కట్టప్పలే సిఎం కేసీఆర్‌ను గద్దె దించుతారని బిజెపి అంటే, దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూలగొట్టండి... దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకి రండి అంటూ సిఎం కేసీఆర్ సవాల్ విసరరడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కింది. ఓ వైపు భారీగా వర్షాలతో వరదలు ప్రవహిస్తున్నా టిఆర్ఎస్-బిజెపిల వేడి మాత్రం చల్లారడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆరా సర్వే) తెలంగాణలో ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే, టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
ఈ వార్తపై ఆ సంస్థ సర్వే హెడ్ మస్తాన్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చి ఆ వార్తను ఖండించారు. కొందరు తమ సంస్థకున్న పేరు ప్రతిష్టలను వాడుకొని ఈవిదంగా ప్రచారం చేసుకొంటున్నారని అన్నారు. అయితే ఇటీవల తమ సంస్థ జరిపిన సర్వే వివరాలను ఆయన ప్రకటించారు.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీకే ఆధిఖ్యత లభిస్తుంది కానీ 38.88 శాతం ఓట్లు మాత్రమే వస్తాయీ. అదేవిదంగా బిజెపికి 30.48 శాతం, కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం, మిగిలిన అన్నీ పార్టీలకు కలిపి 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
2018 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి 46.87 శాతం ఓట్లు వచ్చినందున తాజా సర్వేలో సుమారు 8 శాతం ఓట్లు తగ్గాయని మస్తాన్ తెలిపారు.
తెలంగాణలో స్థిరపడిన ఆంద్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలవైపు మొగ్గు చూపుతుండగా, ఉత్తరాది ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని మస్తాన్ తెలిపారు.
అంటే రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అందుకోసం చాలా శ్రమించవలసి ఉంటుందని స్పష్టం అవుతోంది.