కొత్తగా నిర్మించబడుతున్న పార్లమెంట్ భవనంపై మన జాతీయ చిహ్నామైన నాలుగు సింహాల భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ మొన్న ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. పాత చిహ్నంలో నాలుగు సింహాలు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించేవి కానీ మోడీ ఆవిష్కరించిన విగ్రహంలో నాలుగు సింహాలు కోరలు చూపిస్తూ దాడికి సిద్దమైనట్లున్నాయి.
జాతీయ చిహ్నాన్ని ఈవిదంగా మార్చడంపై దేశంలో ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అవి మోడీలో దాగిన క్రూరత్వానికి, నిరంకుశత్వానికి అద్దం పడుతున్నట్లున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం దేశ ప్రజలపై పడి చీల్చి చెండాడుతున్నదని కొత్త చిహ్నం సూచిస్తున్నట్లు ఉందని వాదిస్తున్నాయి.
పాత చిహ్నంలో నాలుగు సింహాలు ఎంతో గాంభీర్యంగా, రాజసంగా ఉంటే కొత్త చిహ్నంలో చాలా క్రూరంగా కనిపిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది. పాత చిహ్నంలో నాలుగు సింహాలు ఎంతో సౌమ్యంగా, హుందాగా ఉండగా కొత్త చిహ్నంలో సింహాలు కోరలు చూపుతూ మనుషులను తినేసేలా చూస్తునట్లున్నాయని, ఇదే మోడీ అమృతకాలం అని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ట్వీట్ చేసింది. కొత్త జాతీయ చిహ్నంపై ప్రతిపక్షాలు ఇంకా అనేక విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.
కానీ బిజెపి అనుకూలవర్గాలు మాత్రం జాతీయ చిహ్నంలో ఈ స్వల్పమార్పు మన దేశం వైఖరిలో స్పష్టమైన మార్పును సూచిస్తోందని వాదిస్తున్నారు. గతంలో భారత్ చాలా మెతకవైఖరిని ప్రదర్శించేదని, ఆ కారణంగా పాకిస్తాన్‌తో సహా చాలా దేశాలు భారత్ పట్ల చులకనగా వ్యవహరించేవని, కానీ ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్ అంతర్జాతీయ వ్యవహారాలలో చాలా ధృడమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారని, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ దేశాల పట్ల ఖరాఖండిగా వ్యవహరిస్తూ వాటిని హద్దులలో ఉంచుతున్నారని మోడీ అనుకూలవర్గాలు వాదిస్తున్నారు.
ఈ కారణంగా అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మళ్ళీ పెరిగిందని, భారత్‌ను తేలికగా తీసుకోకూడదని అన్ని దేశాలు గ్రహించాయని వాదిస్తున్నారు. భారత్ జోలికి వస్తే సహించబోమని కొత్త చిహ్నంలో సింహాలు సూచిస్తున్నాయని, దానిలో తప్పు ఏమీ లేదని బిజెపి అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. భారత్ వైఖరిలో మార్పును సూచించేందుకే ఆవిదంగా చిన్న మార్పు చేశారు తప్ప జాతీయ చిహ్నాన్ని మార్చలేదని వాదిస్తున్నారు.