ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన స్పైస్ జట్ విమానసంస్థకు చెందిన విమానాలలో రోజుకో లోపం తలెత్తుతుండటంతో ఆ సంస్థ పరువు పోతోంది. గత 24 రోజులలో 8 సార్లు అంటే సగటున ప్రతీ మూడు రోజులకి ఒకసారి స్పైస్ జెట్ విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.
తాజాగా ఇవాళ్ళ మంగుళూరు నుంచి దుబాయ్‌కి చేరుకొన్న బోయింగ్ 737 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ విమానం ముందువైపు ఉండే నోస్ వీల్ మెకానిజం సరిగ్గా పనిచేయడం లేదని ఇంజనీర్లు గుర్తించడంతో ఆ విమానాన్ని అక్కడే నిలిపివేశారు. దానిలో మధురై వెళ్లవలసిన ప్రయాణికుల కోసం స్పైస్ జెట్ సంస్థ మరో విమానాన్ని ముంబై నుంచి దుబాయ్‌కి పంపించింది. అంతవరకు ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయంలో ఎదురుచూడవలసి వచ్చింది.
అయితే నోస్ వీల్ పనిచేయడంలేదని సకాలంలో ఇంజనీర్లు గుర్తించినందున వారు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఒకవేళ దుబాయ్‌లో ఇంజనీర్లు పరిశీలించినప్పుడు ఈ సమస్యను గుర్తించలేకపోయుంటే ఆ విమానం మధురైలో ల్యాండ్ అవుతున్నప్పుడు నోస్ వీల్ పనిచేయక పెను ప్రమాదం సంభవించి ఉండేది.
ఈ నెల 5వ తేదీన ఢిల్లీ నుంచి దుబాయ్ వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో ఒక ఇంజనుకు ఆయిల్ అందించే ట్యాంకులో ఆయిల్ లెవెల్ తగ్గిపోయినట్లు చూపడంతో, దారిలో కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆయిల్ ఇండికేటర్ సిగ్నల్ సరిగ్గా పనిచేయలేదని ఇంజనీర్లు గుర్తించి సరిచేశారు.
ఆదేరోజున గుజరాత్ నుంచి ముంబై వెళుతున్న మరో స్పైస్ జెట్ విమానం భూమికి 23,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా విండ్ షీల్డ్ (అద్దం)లో పగుళ్ళు ఏర్పడ్డాయి. కానీ అప్పటికే విమానం ముంబై విమానాశ్రయం సమీపానికి చేరుకోవడంతో పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. స్పైస్ జెట్ విమానాలలో వరుసగా ఇన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకం అవుతోంది. ఆ సంస్థ కూడా తీవ్రంగా నష్టపోతోంది. సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతోంది.