తెలంగాణలో కట్టప్పలను సృష్టించింది ఎవరు? కాంగ్రెస్‌ ప్రశ్న

July 12, 2022


img

మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సాయంతో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూలద్రోసి బిజెపి అధికారం చేజిక్కించుకోవడం, టిఆర్ఎస్‌ ప్రభుత్వంలో కట్టప్పలున్నారని, వారు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూలద్రోయబోతున్నారని బిజెపి ఎంపీ కె. లక్ష్మణ్ హెచ్చరించడంపై సిఎం కేసీఆర్‌ బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

కేసీఆర్‌ వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందిస్తూ, “ఉన్నత లక్ష్యాలతో పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను కలుషితం చేసిందెవరు? మీరే (సిఎం కేసీఆర్) కదా? రాష్ట్రంలో తనకు ఎదురే ఉండకూడదనే ఆలోచనతో ఏక్‌నాథ్ షిండేలను తయారు చేసి కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను, నేతలను ప్రలోభపెట్టి టిఆర్ఎస్‌ పార్టీలో చేర్చుకొన్నప్పుడు మీకు ఈ నీతులు, ప్రజాస్వామ్య విలువలు ఏవీ గుర్తుకు రాలేదు. మా పార్టీలను రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నించిన విషయం అప్పుడే మరిచిపోయారా? కానీ ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని ఏక్‌నాథ్ షిండేలు కూల్చివేస్తారనగానే మీకు ఆగ్రహం వచ్చేస్తోంది?

ఏడేళ్ళ క్రితమే రాష్ట్రంలో ఏక్‌నాథ్ షిండేలను సృష్టించింది మీరే కదా?ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను టిఆర్ఎస్‌ పార్టీలో రప్పించుకొని మంత్రి పదవి కట్టబెట్టి మీ పక్కనే కూర్చోబెట్టుకొన్నారు కదా? రాష్ట్రంలో ప్రతిపక్షాలను టిడిచిపెట్టేయాలని ప్రయత్నించిన మీరు, ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే గురించి మాట్లాడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. మీరు సృష్టించిన ఆ కట్టప్పలే మిమ్మల్ని ముంచేయడం ఖాయం.

ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు మీకు ధైర్యం ఉంటే కేంద్రంతో ముడి పెట్టకుండా తక్షణం మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకి రండి. ముందస్తు ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సిద్దంగానే ఉంది. రాష్ట్రంలో ప్రజలు కూడా మిమ్మల్ని సాగనంపడానికి సిద్దంగానే ఉన్నారు,” అని అన్నారు. 


Related Post