భారత్‌లో బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి 2016లో లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. విచారణకు హాజరు కావాలనే సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా ఆయన ఖాతరు చేయకుండా భారత్ సర్వోన్నత న్యాయవ్యవస్థను, భారత్ సార్వభౌమత్వాన్ని అపహాస్యం చేస్తున్నారు.
ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో సుప్రీం కోర్టు దానిని కోర్టుధిక్కారంగా పరిగణించి ఆయనకు రూ.2,000 జరిమానా, నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ నేడు తీర్పు చెప్పింది. రూ.9,000 కోట్లు ఎగవేసి పారిపోయిన విజయ్ మాల్యా లండన్‌లో చాలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయనకు సుప్రీం కోర్టు విధించిన ఈ జరిమానా ఆయన కాల్చే చుట్టలపాటి కూడా చేయదు. అయినప్పటికీ ఆయన చేత భారత్ ప్రభుత్వం ఆ పాటి జరిమానాను కూడా వసూలు చేయలేదు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయనను అరెస్ట్ చేసి తీసుకువచ్చి జైలుకు పంపలేదు. కనుక ఇటువంటి తీర్పులు వెలువరించడం వలన మన పరువు మనమే తీసుకొంటున్నట్లవుతోంది తప్ప మరేమీ కాదని చెప్పవచ్చు.