జపాన్ మాజీ ప్రధాని అగ్నిపథ్‌కే బలయ్యారా?

July 09, 2022


img

 జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మొన్న ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా, తెత్సూయ యమగామి అనే ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాగో బంగ్లా వేరే కోణంలో నుంచి సమస్యను చూపింది. 

షింజో అబేను హత్య చేసిన వ్యక్తి మూడేళ్ళు జపాన్ నావికా దళంలో పనిచేసి బయటకు వచ్చాడు. దానిలో అతనికి పింఛను లభించదు. ఆ తరువాత అతనికి ఏ ఉద్యోగం లభించకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై షింజో అబేను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. 

జాగో బాంగ్లా ఇదే అంశం ప్రస్తావిస్తూ, కేంద్రప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ విధానంలో త్రివిద దళాలలో భర్తీ కాబోతున్న యువకులు నాలుగేళ్ళ తరువాత ఉద్యోగాలలో నుంచి బయటకు వచ్చినప్పుడు వారు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటారు కనుక భారత్‌లో కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చని విశ్లేషించింది. ఎందుకంటే, అగ్నిపథ్‌ విధానంలో జవాన్లుగా పనిచేసినవారికి, వారు సర్వీసులో ఉండగా వారి జీతాలలో నుంచి మినహాయించుకొన్న కొంత సొమ్ముకి కేంద్రప్రభుత్వం కూడా అంతే సొమ్ము కలిపి వారు బయటకు వెళ్ళేటప్పుడు వారి చేతిలో రూ.12 లక్షలు నగదు పెడుతుంది. వారికి ఎటువంటి పింఛను ఇవ్వదు. 

కనుక నాలుగేళ్ళ సర్వీసు తరువాత వారు ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక వారి వలన ఊహించని సమస్యలు ఏర్పడవచ్చని జాగో బాంగ్లా సూచిస్తోంది.


Related Post