బిజెపి సీనియర్ నేత కె.లక్ష్మణ్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. బిజెపిలో కష్టపడేవారికి ఎప్పుడూ సముచిత ప్రాధాన్యత, గౌరవం లభిస్తాయని చెప్పేందుకు నాకు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఓ ఉదాహరణ.
ఎన్నో పోరాటలతో సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారు. ఉద్యమంలో పాల్గొన్నవారిని పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులతో పరిపాలన సాగిస్తున్నారు. ఆ కారణంగా టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నెలకొని ఉంది. వారే కట్టప్పలుగా మారి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు. ఆ కట్టప్పలతో బిజెపికి ఎటువంటి సంబందమూ లేదు,” అని అన్నారు.
ఇటీవల మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏక్‌నాథ్ షిండే అనే కట్టప్ప సాయంతో కూల్చివేసింది. అప్పుడూ ఇలాగే ఆ కట్టప్పతో తమ పార్టీకి సంబందం లేదని బిజెపి వాదించింది. కానీ చివరికి ఆ కట్టప్పతోనే కలిసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కనుక తెలంగాణలో కూడా అటువంటి కుట్ర చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. లేదా టిఆర్ఎస్ పార్టీ నేతల మద్య పరస్పరం అనుమానాలు సృష్టించేందుకు కట్టప్ప పేరుతో మైండ్ గేమ్స్ ఆడుతోందని భావించవచ్చు. టిఆర్ఎస్ పార్టీలో కూడా ఎంతో కొంత అసంతృప్తి ఉండటం సహజమే కానీ అది కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసే స్థాయిలో ఉందనుకోలేము.
అయితే తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని బిజెపి విస్పష్టంగా చెపుతున్న బిజెపి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయబోతున్నారని జోస్యం చెపుతోంది. కనుక బిజెపి టిఆర్ఎస్‌లో కట్టప్ప లేకపోతే బిజెపియే తయారుచేసి వారి ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించబోతోందని స్పష్టం అవుతోంది. కనుక టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజెపి చేయబోతున్న ఈ కుట్రను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండక తప్పదు.