వైసీపీకి విజయమ్మ రాజీనామా!

July 08, 2022


img

నేటి నుంచి వైసీపీ ప్లీనరీ సమావేశాలు మొదలయ్యాయి. విజయవాడ-గుంటూరు మద్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మైదానం అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తొలిరోజు సమావేశానికి లక్షమందికి పైగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో ప్లీనరీలో పండగ వాతావరణం నెలకొంది. వచ్చినవారి కోసం నోరూరించే అనేక వంటలు సిద్దం చేశారు.

ప్లీనరీలో ఇటువంటి పండగ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఆమె కుమారుడు సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆమె చేత రాజీనామా చేయించి బయటకు సాగనంపబోతున్నారని నిన్నటి నుంచే మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అవి నిజమని నిరూపిస్తూ విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ సభలో స్వయంగా ప్రకటించారు. 

తన ఉనికి వలన ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతోనే పార్టీ నుంచి బయటకువెళ్ళిపోతున్నానని ఆమె చెప్పడంతో ప్లీనరీకి వచ్చిన వైఎస్సార్ అభిమానులు కన్నీళ్ళు పెట్టుకొన్నారు. అయితే తాను తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్న తన కుమార్తె వైఎస్ షర్మిలకు అండగా నిలబడేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నానని చెప్పి అందరి గౌరవం కాపాడే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని కనుక వైఎస్ షర్మిలకు తన అందండలు ఎక్కువ అవసరం ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నానని విజయమ్మ చెప్పారు. 

కానీ వాస్తవం ఏమిటంటే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఎం జగన్మోహన్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలను తన మంత్రివర్గంలోకి తీసుకొని కీలకమైన పదవి ఇస్తారని అందరూ ఊహించారు. కానీ ఆమెను పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెట్టడంతో, ఆమె తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే సొంత కుంపటి పెట్టుకొని తనకు బాగా అలవాటైన పాదయాత్రతో ప్రజల మద్యకు వెళ్ళారు. 

జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం కోసం వైఎస్ షర్మిల ఎంతో కష్టపడ్డారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక చెల్లెలిని పక్కన పెట్టి ఆమె తెలంగాణకు వెళ్ళిపోయేలా చేసినందుకు బహుశః విజయమ్మ తల్లి మనసు ఆక్రోశించి ఉండవచ్చు. బహుశః ఈ కారణంగానే ఆమె చాలా కాలంగా కుమారుడికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె కూడా వైసీపీకి, కొడుకు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసి తెలంగాణకు వచ్చేస్తున్నారు. 


Related Post