బిజెపికి కాంగ్రెస్‌ షాక్... రేవంత్‌ రెడ్డికి కోమటిరెడ్డి షాక్!

July 08, 2022


img

బిజెపికి కాంగ్రెస్‌ పార్టీ షాక్ ఇస్తే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి షాక్ ఇవ్వడం విశేషం. మహబూబ్‌నగర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఎర్ర శేఖర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి బిజెపికి షాక్ ఇవ్వగా, ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పి రేవంత్‌ రెడ్డికి షాక్ ఇచ్చారు. 

నేర చరిత్ర కలిగిన ఎర్ర శేఖర్‌ను పార్టీలో ఏవిదంగా చేర్చుకొంటారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఇటువంటి నేర చరితులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకొంటున్నారని ప్రశ్నించారు. ఎర్ర శేఖర్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, ఈ విషయంపై సోనియా గాంధీకి లేఖ వ్రాస్తానని చెప్పారు. జడ్చర్ల కాంగ్రెస్‌ నేత అనిరుధ్ రెడ్డి సైతం ఎర్ర శేఖర్‌ చేరికను వ్యతిరేకిస్తున్నారు. 

ఎర్ర శేఖర్‌ 1995, 1999, మళ్ళీ 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2014,2018లో ఎన్నికలలో ఓడిపోయారు. టిడిపిలో నుంచి టిఆర్ఎస్‌లోకి దానిలో నుంచి బిజెపిలోకి వెళ్ళిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా స్థాయి బిజెపి నేతలతో పొసగకపోవడంతో ఆయన బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్‌ నేతల సమక్షంలో రేవంత్‌ రెడ్డి ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరుకాకపోవడమే కాక బహిరంగంగా తన వ్యతిరేకతను తెలియజేశారు.


Related Post