నాగబాబు కామెంట్స్ ఎవరిని ఉద్దేశ్యించో?

July 07, 2022


img

స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవం సందర్భంగా నాలుగు రోజుల క్రితం అంటే జూలై 3వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ఓ సభ జరిగింది. దానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా విచ్చేసి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

విశేషమేమిటంటే కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె. రోజాలతో పాటు రాజకీయంగా బద్ద విరోదులైన బిజెపి, వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇంకా విశేషమేమిటంటే 2014 ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేసిన చిరంజీవికి కూడా ఈ సభకు ఆహ్వానం అందింది. ఆయన ఏ మాత్రం సంశయించకుండా ఆ సభలో పాల్గొన్నారు. 

అయితే ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటున్న ఆ సభకు ఏపీలో బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్‌ హాజరుకాకపోవడం మరో విశేషం. పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటూ విమర్శించే సిఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని ‘నా సోదరుడు’ అని సంభోదించడం మరో విశేషం. 

ఇక మంత్రి హోదాలో ఉన్న ఆర్‌కె. రోజా ఓ సామాన్య కార్యకర్తలాగా ప్రధాని నరేంద్రమోడీ, చిరంజీవిలతో సెల్ఫీల కోసం ఆరాటపడటం మరో విశేషం. 

ఇంత విలక్షణమైన ఈ సభలో “చిరంజీవి తప్ప మిగిలిన వారందరూ చాలా బాగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు...” అంటూ చిరంజీవి సోదరుడు నాగబాబు ట్వీటేశారు. అది ఎవరిని ఉద్దేశ్యించి? చిరంజీవిని ‘సోదరుడు’ అని సంభోదించిన సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించా లేక మంత్రిననే విషయం మరిచి సెల్ఫీ ఫోటోల కోసం ఎగబడిన రోజాని ఉద్దేశ్యించా?లేక అల్లూరి సీతారామరాజు గురించి భీమవరం ప్రజలకు పాఠాలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించా?అంటే ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించుకోవలసిందే!  



Related Post