హైదరాబాద్‌లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతం అవడంతో రాష్ట్ర బిజెపి నేతలు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అప్పుడే మళ్ళీ పని మొదలుపెట్టేశారు. ఈరోజు మూడు కమిటీలను ప్రకటించారు కానీ ఆ కమిటీల పేర్లు, వాటి లక్ష్యాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 1. చేరికల సమన్వయ కమిటీ; 2. ప్రజా సమస్యలు-టిఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ; 3. ఫైనాన్స్ కమిటీ.
ఒకప్పుడు అన్ని పార్టీలు తమ ఆశయాలు, సిద్దాంతాల పట్ల నమ్మకం కలిగిన కార్యకర్తలను వారిలో నుంచి నేతలను తయారుచేసుకొనేవి. కానీ ఇప్పుడు పార్టీ బలోపేతం అంటే పక్క పార్టీలో నుంచి నేతలను లాగేయడమే అని గట్టిగా నమ్ముతున్నాయి. అయితే ఏ పార్టీ కూడా పక్క పార్టీల నేతలను ఆకర్షించడానికి ఈవిదంగా చేరికల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోలేదు. బిజెపి నిసిగ్గుగా ఏర్పాటు చేసుకొంది కనుక ఈ క్రెడిట్ దానికే సొంతం.
చేరికల సమన్వయ కమిటీకి కన్వీనరుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సభ్యులుగా డికె.అరుణ, డా.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, గరికపాటి మోహన్‌రావు, దుగ్యాల ప్రదీప్ కుమార్ ఉన్నారు. ఇకపై వీరందరూ ఇతర పార్టీల నేతలకు వల వేస్తుంటారన్న మాట!
ఇక ప్రజా సమస్యలపై అధ్యాయనం కోసం కమిటీ ఏర్పాటు చేసుకోవడం బాగానే ఉంది కానీ టిఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యకరమే. టిఆర్ఎస్ వైఫల్యాల అధ్యయన కమిటీ కన్వీనరుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, సభ్యులుగా రఘునందన్ రావు, స్వామిగౌడ్, డా,ప్రకాష్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, బాజీ అజ్మీరా ఉన్నారు.
ప్రతీ పార్టీకి కోశాధికారి ఉంటారు. అతని కింద ఓ బృందం ఉంటుంది. వారే పార్టీ ఆదాయ, వ్యయాలన్నిటినీ చూస్తుంటారు. కానీ బండి సంజయ్ కొత్తగా ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు చేశారు. బహుశః వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే నిధులు సమకూర్చుకోవడానికి బహుశః ఈ కమిటీ ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఫైనాన్స్ కమిటీ కన్వీనరుగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, చాడా సురేశ్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, యోగానంద్, శాంతి కుమార్ ఉన్నారు.
ఈ మూడు కమిటీల ఏర్పాటు, వాటి లక్ష్యాలను బట్టి ఈసారి ఎన్నికలలో గెలిచితీరాలని బిజెపి ఎంత పట్టుదలగా ఉందో అర్దం అవుతుంది.