రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్య పెద్ద యుద్ధమే జరిగింది.
తాము మద్దతు ఇస్తున్న ఆయనను టిఆర్ఎస్ పార్టీ హైజాక్ చేసినట్లు ఎత్తుకుపోవడంతో రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరూ వెళ్ళి ఆయనను కలువబోమని, ఆయనే స్వయంగా తమ వద్దకు వచ్చినా కలువబోమని తెగేసి చెప్పారు. అయితే సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, ఆ నిర్ణయాన్ని పట్టించుకోకుండా బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి యశ్వంత్ సిన్హాను కలిసివచ్చారు.
దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “పార్టీ క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా వాళ్ళని గోడకేసి కొడతా...” అంటూ ఘాటుగా హెచ్చరించారు.
దానిపై జగ్గారెడ్డి వెంటనే స్పందిస్తూ, “అసలు మమ్మల్ని వద్దనడానికి నువ్వెవరు? ముందు పార్టీ నుంచి నిన్నే బయటకు పంపించాలి. నేను సోనియా గాంధీకి నీపై ఫిర్యాదు చేస్తూ లేఖ వ్రాస్తాను,” అంటూ ఘాటుగా జవాబిచ్చారు.
దీంతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ‘కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన’ , ‘యశ్వంత్ సిన్హా రాకతో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు’ అంటూ ప్రదానంగా వార్తలు వచ్చాయి.
అవి చూసి జగ్గారెడ్డి ఇంకా రెచ్చిపోయి, “రేపు నేను ప్రెస్‌మీట్‌లో అతిముఖ్యమైన ఓ విషయం ప్రకటించబోతున్నానని” ప్రకటించారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని కాదు... రేవంత్ రెడ్డిపై మళ్ళీ విమర్శలు గుప్పిస్తారని రకరకాలుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరికి ఆయన ఏమి చెప్పరంటే, “తూచ్! అదంతా మీడియా అటెన్షన్ మావైపు తిప్పుకోవడానికి ఆడిన చిన్న డ్రామా!
వారం రోజుల నుంచి చూస్తున్నా... 24 గంటలు టిఆర్ఎస్, బిజెపిల గురించే మీడియా చెపుతోంది తప్ప మా పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. టిఆర్ఎస్, బిజెపిలే మొత్తం మీడియా అటెన్షన్ కొట్టేస్తుంటే మేము చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోలేము కదా?అందుకే ఈ ట్రిక్ ప్లే చేశాము. దాంతో అంత హడావుడిలో కూడా మీడియా వార్తలలో మా పార్టీ పేరు ప్రధానంగా వినబడింది కదా? నేను ఎప్పుడు ఏమి మాట్లాడినా అది కాంగ్రెస్ కోసమే అయ్యుంటుంది. కాంగ్రెస్ లైన్లోనే ఉంటాయి తప్ప వేరే ఉండదు. ఇప్పుడూ నేను మా కాంగ్రెస్ పార్టీ కోసం ఈ చిన్న ట్రిక్ ప్లే చేశాను. మాలో మాకు ఎటువంటి విభేధాలు లేవు. మేమందరం కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణతో పనిచేసే సైనికులవంటివారమే,” అని అన్నారు.
జగ్గారెడ్డి చెప్పింది విని మీడియా కూడా షాక్ అయ్యింది. మీడియా అటెన్షన్ కావాలంటే టిఆర్ఎస్, బిజెపిలను విమర్శించాలి కానీ సొంత పార్టీ నేతలను విమర్శించడం ఏమిటి విదూరం కాకపోతే? అని అనుకొన్నారు.