తీగల బ్యాగ్ సర్దుకొంటున్నారా?

July 05, 2022


img

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అధికార టిఆర్ఎస్‌ పార్టీలో కూడా లుకలుకలు మొదలవుతున్నాయి. టిఆర్ఎస్‌ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్య చాలాకాలంగా విభేధాలున్నాయి. అవి ఇప్పుడు బయటపడ్డాయి. 

తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్‌పేట్‌లో చెరువులు, పాఠశాలల భూముల కబ్జాలకు ప్రోత్సహిస్తూ ఆ ప్రాంతనంతా నాశనం చేస్తున్నారు. ఆమె తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మీర్‌పేట్‌ను నాశనం చేస్తుంటే నేను ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చోలేను. మీర్‌పేట్‌ను కాపాడుకొనేందుకు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడను. ఆమె మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవకపోయినా సిఎం కేసీఆర్‌ ఆమెకు మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తే ఆమె తన ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సిఎం కేసీఆర్‌ను కలిసి ఆమె మీర్‌పేట్‌లో ఎక్కడెక్కడ ఏవిదంగా కబ్జాలను ప్రోత్సహిస్తున్నారో వివరిస్తాను,” అని అన్నారు. 

తీగల కృష్ణారెడ్డి చాలా కాలంగా మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు వచ్చి ఏకంగా తమ ప్రభుత్వంలో కీలకమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిపైనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పార్టీకే చెందిన తీగల కృష్ణారెడ్డి బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయడంతో ప్రతిపక్షాలు ఆరోపణలను దృవీకరించినట్లవుతుంది. దీని వలన టిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఆయన సిఎం కేసీఆర్‌ను కలిసి ఆమెపై ఫిర్యాదు చేయడం కాదు... ఆమెపై బహిరంగంగా ఇటువంటి ఆరోపణ చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సిఎం కేసీఆర్‌ ఆయనపై వేటు వేయవచ్చు. కనుక ఆయన పార్టీని వీడి వెళ్ళేందుకే మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఇటువంటి ఆరోపణలు చేశారా? అనే సందేహం కలుగుతుంది. ఈ ప్రశ్నకు త్వరలోనే తప్పక సమాధానం లభిస్తుంది.


Related Post