టిఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ మరో షాక్... బడంగ్ పేట్ మేయర్ జంప్!

July 04, 2022


img

తెలంగాణ ఏర్పడిన తరువాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, పార్టీ ముఖ్య నేతలను సిఎం కేసీఆర్‌ బంగారి తెలంగాణ కోసం అంటూ టిఆర్ఎస్‌ పార్టీలోకి ఆకర్షించి ఆ పార్టీని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్‌కు చెందిన నేతలను ఆకర్షించి పార్టీలో చేర్చుకొంటూ సిఎం కేసీఆర్‌కు షాకులు ఇస్తోంది. 

ఇటీవల ఖైరతాబాద్‌ టిఆర్ఎస్‌ కార్పొరేటర్ విజయరెడ్డికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఇవాళ్ళ బడంగ్ పేట్ మేయర్ పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డిలను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆకర్షించి సిఎం కేసీఆర్‌కు మరో షాక్ ఇచ్చారు. వారివురు రేవంత్‌ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఇక్కడ మోడీ, అక్కడ కేసీఆర్‌ ఇద్దరూ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారు. వీరిరువురి పాలనలో సామాన్య ప్రజలు బ్రతకడమే కష్టమైపోతోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అయినకాడికి అప్పులు చేస్తూ ప్రజలపై పెను భారం మోపుతున్నాయి. కనుక బిజెపి, టిఆర్ఎస్‌ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు అందరూ ఏకతాటిపైకి రావలసి ఉంది,” అని అన్నారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ మిగులు బడ్జెట్‌ చూపించగలదా? అంటే కాదనే అందరికీ తెలుసు. అధికారంలో లేనప్పుడే ఇంతగా కీచులాడుకొంటున్న కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉంటే ఏవిదంగా వ్యవహరిస్తారో అందరూ చూశారు. అయితే ఇప్పుడు అన్ని పార్టీలది ఇదే తీరు కనుక ప్రజలు కూడా వాటి నుంచి ఏమీ ఆశించడంమానుకొని తమపై ఇంకా భారం వేయకుండా ఉంటే అదే చాలనుకొంటున్నారు. కానీ సామాన్య ప్రజల ఆశను కూడా మన పార్టీలు కాపాడలేకపోతున్నాయి.


Related Post