బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో విజయ సంకల్ప సభ నిర్వహించింది. ఈసభకు భారీగా జనసమీకరణ చేయడంతో ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి అగ్రనేతలందరూ చాలా సంతోషించారు. ఇప్పుడు భారీగా జనసమీకరణ చేయగలిగితే సభ విజయవంతమైన్నట్లే లెక్క గనుక ఈ సభ కూడా విజయవంతమైనట్లే లెక్క.
అయితే ఈ సభకు ఒకరోజు ముందు సిఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోడీ జవాబివ్వలేదు. తెలంగాణలో తమ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని చెప్పారు తప్ప సిఎం కేసీఆర్‌ని, ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ ఎటువంటి విమర్శలు చేయలేదు.
అయితే కేంద్రప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్, పేదలకు రేషన్ బియ్యం పంపిణీ వంటి సంక్షేమ పధకాలకు కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తోందని ప్రధాని నరేంద్రమోడీ నొక్కి చెప్పారు.
తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావాలనుకొంటున్నట్లు ప్రధాని నరేంద్రమోడీతో సహా అందరూ విస్పష్టంగానే చెపుతున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి కూల్చివేసినప్పుడే హైదరాబాద్‌లో ఈ సమావేశాలు, సభ నిర్వహించడంతో ప్రజలకు బిజెపి తప్పుడు సంకేతాలు పంపినట్లయింది.
వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకొంటునట్లు బిజెపి స్పష్టంగా చెపుతున్నప్పటికీ, అవకాశం చిక్కితే రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కారుని కూడా కూల్చివేసే ప్రయత్నాలు చేయవచ్చనే భావన, అనుమానం తెలంగాణ ప్రజలలో కలిగించింది. అందుకే బిజెపికి దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చి చూపాలని టిఆర్ఎస్ సవాల్ చేసింది.
ఇక నీళ్ళు, నిధులు, నియామకాల గురించి బిజెపి అగ్రనేతలు టిఆర్ఎస్ సర్కారుని ప్రశ్నించడం వారి అజ్ఞానానికి నిదర్శనంగా కనిపిస్తోంది. వారి ఈ ప్రశ్నకు మంత్రి హరీష్‌రావు ధీటుగా జవాబు చెప్పారు. దాని గురించి వేరేగా చెప్పుకొందాము.