తెలంగాణ అభివృద్ధి చెందింది కానీ డబుల్ ఇంజన్ అవసరం: ప్రధాని మోడీ

July 04, 2022


img

హైదరాబాద్‌లో జరిగిన రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో విజయసంకల్ప సభ జరిగింది. ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులు, బిజెపి ముఖ్య నేతలు దానిలో పాల్గొన్నారు. ఆ సభలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెపుతూ అందుకోసం తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగానో తోడ్పడిందని చెప్పారు.

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్దరణ, ధాన్యం కొనుగోలు, రాష్ట్రంలో సంక్షేమ పధకాలు అమలు తదితరాలను ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. అయితే మిగిలిన రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావలసిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్‌ పార్కు, సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు.

తమ ప్రభుత్వం దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు చాలా కృషి చేస్తోందని చెప్పారు. కరోనా కష్టకాలంలో తమ ప్రభుత్వం దేశంలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా టీకాలు సరఫరా చేసిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.

కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సభలో ప్రసంగించిన మిగిలిన బిజెపి నేతలందరూ సిఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సిఎం కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే జాతీయ రాజకీయాలంటూ డ్రామా ఆడుతున్నారని కేంద్రహోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కుటుంబపాలనను అంతమోదిస్తామని బిజెపి నేతలు గర్జించారు.  

దీంతో హైదరాబాద్‌లో రెండు రోజుల బిజెపి హడావుడి ముగిసింది. ఈ సభని బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా భావించడంతో  రాష్ట్రం నలుమూలల నుంచి  లక్షలాదిమందిని జనసమీకరణ చేయడంతో వారితో పెరేడ్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. అది చూసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సభకు తరలివచ్చినట్లు అనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇంత భారీ స్థాయిలో జనసమీకరణ చేసి సభను విజయవంతం చేసినందుకు బండి సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. 


Related Post