హైదరాబాద్‌లో జరుగుతున్న బిజెపి జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్నారు. కానీ సిఎం కేసీఆర్ ఈసారి కూడా ఆయనకు మొహం చాటేశారు. తనకు బదులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన ఒక్కరే ప్రధానికి స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బిజెపి నేతలు ఆయనకు సాధారంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బిజెపి జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు హెచ్ఐసిసికి వెళ్ళిపోయారు.
ప్రధాని నరేంద్రమోడీ వెళ్ళిన తరువాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రధానమంత్రి నగరానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రే తప్పనిసరిగా స్వాగతం పలకాలని ఎక్కడా లేదు. కనుక ప్రభుత్వం తరపున నేను వచ్చి ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలికాను,” అని చెప్పారు.
రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఈరోజు ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం హైదరాబాద్ చేరుకొన్నప్పుడు సిఎం కేసీఆర్, మంత్రులందరినీ వెంటబెట్టుకొని మరీ నేరుగా విమానం వద్దకే వెళ్ళి ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు తరలిరగా వేలాదిమందితో బైక్ ర్యాలీతో ఆయనను జలవిహార్‌కు తోడ్కొని తీసుకువెళ్లారు.
రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోబోతున్న, తన బద్ద శత్రువైన కాంగ్రెస్ బలపరుస్తున్న యశ్వంత్ సిన్హాకు ఇంత ఘనంగా స్వాగతం పలికిన సిఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు మొహం చాటేయడం, మొక్కుబడిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపించడం సరికాదనే చెప్పాలి.
బిజెపితో టిఆర్ఎస్‌కు ఎంత రాజకీయ శతృత్వం ఉన్నప్పటికీ, కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేనప్పటికీ, దేశ ప్రధాని నగరానికి వచ్చినప్పుడు ఆయనను గౌరవంగా స్వాగతం పలికి అంతే గౌరవంగా సాగనంపడం కనీస మర్యాద.
ప్రధాని నరేంద్రమోడీ నగరానికి వచ్చినప్పుడు ఈవిదంగా వ్యవహరిస్తూ, తమ ప్రభుత్వంతో కేంద్రం పద్దతిగా వ్యవహరించాలని సిఎం కేసీఆర్ ఆశించడం అత్యాశే అవుతుంది కదా? ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్రమోడీని అవమానిస్తే, రేపు కేసీఆర్ ఆయనను కలిసేందుకు ఢిల్లీ వెళితే ఇదే మర్యాద లభించవచ్చు.