దమ్ బిర్యాని తిని, ఇరానీ ఛాయ్ తాగి మా రాష్ట్రాభివృద్ధిని చూడండి

July 02, 2022


img

నేడు రేపు హైదరాబాద్‌ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, దేశంలో 18 బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి ముఖ్య నేతలు హాజరవుతారు. కనుక గులాబీ జెండాలు, టిఆర్ఎస్‌ నేతల ఫ్లెక్సీ బ్యానర్లతో ఉండే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా కాషాయజెండాలు, బిజెపి నేతల ఫ్లెక్సీ బ్యానర్లే కనిపిస్తున్నాయి. ఢిల్లీ, వివిద రాష్ట్రాల నుంచి నగరానికి వస్తున్న బిజెపి అగ్రనేతల భారీ ఊరేగింపులతో జంటనగరాలలో ఎక్కడ చూసినా బిజెపి  హడావుడే కనిపిస్తోంది. 

హైదరాబాద్‌లో జరుగబోతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు, బిజెపి నేతల ఈ హడావుడిపై మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందిస్తూ, “సుందరమైన హైదరాబాద్‌ నగరంలో జాతీయ కార్యవర్గ సమావేశాలకి వస్తున్న వాట్సాప్‌ యూనివర్సిటీకి సుస్వాగతం. అబద్దాల హామీలు ఇస్తున్న వారందరూ మా దమ్ బిర్యాని తిని, ఇరానీ ఛాయ్ తాగడం మరిచిపోకండి. తెలంగాణలో పర్యటించి మా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూడండి. వీలైతే మీ రాష్ట్రాలలో కూడా అమలుచేసుకోండి,” అని సూచిస్తూ రాష్ట్రాభివృద్ధిని సూచిస్తూ, యాదాద్రి ఆలయం, కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం ద్వారా సాగునీరు, ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమయిన టీ-హబ్‌ ఫోటోలను పెట్టారు.       



Related Post