ఈరోజు కోసం భారత్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో డిఆర్‌డివో తయారుచేసిన మానవ రహిత యుద్ధవిమానాన్ని నేడు విజయవంతంగా పరీక్షించారు. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ విమానాన్ని డిఆర్‌డివో అధికారులు ప్రయోగించి అన్ని రకాలుగా పరీక్షించి చూశారు. అన్ని పరీక్షలలో అది విజయవంతమైందని అధికారులు తెలిపారు.
టేకాఫ్, వేపాయింట్, నావిగేషన్, స్మూత్ టచ్‌డౌన్ వంటి అన్నిటినీ నూటికి నూరుశాతం ఖచ్చితంగా చేసిందని తెలిపారు. దీనిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఇది పూర్తిగా స్వీయనియంత్రణతో పనిచేయగలదు. ఇప్పటివరకు ఇటువంటి మానవరహిత యుద్ధ విమానాలను అమెరికా తదితర దేశాలను కోట్లాదిరూపాయలు వెచ్చించి భారత్ కొనుగోలు చేస్తోంది. ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దీనిని దేశీయంగా తయారుచేయడంతో విదేశాలపై ఆధారపడవలసిన అవసరం తప్పుతుంది.
అయితే ఇది కేవలం ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు మాత్రమే తయారుచేసిన విమానం. కానీ ఇది విజయవంతంగా అన్ని పరీక్షలను పూర్తిచేయడంతో భవిష్యత్‌లో మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో అవసరమైన కీలకమైన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఇది చాలా తోడ్పడుతుందని డిఆర్‌డివో అధికారులు తెలిపారు.
దీనిని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఏ)కు చెందిన ప్రధాన పరిశోధన ప్రయోగశాలలో డిఆర్‌డివో అధ్వర్యంలో తయారుచేశారు. దీనిలో ఉపయోగించిన చిన్న టర్బో ఫ్యాన్ కలిగిన ఇంజన్, ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లైట్ కంట్రోల్, ఏవియానిక్స్ వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేశారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం అవడంతో ప్రధాని నరేంద్రమోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఆర్‌డివో శాస్త్రవేత్తలను అభినందించారు.