రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాబోతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయనను కలిసి మద్దతు పలకలేని ఓ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
ఆయన రేపు బేగంపేట విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లిపోయేవరకు సిఎం కేసీఆర్, కేటీఆర్ లేదా టిఆర్ఎస్ మంత్రులు, ముఖ్యనేతలు ఆయన పక్కనే ఉంటారు. కనుక కాంగ్రెస్ నేతలెవరూ వెళ్ళి ఆయనను కలువలేరు. ఒకవేళ వారి సమక్షంలో కలిసే ప్రయత్నం చేస్తే మీడియా ప్రతినిధులు వదిలిపెట్టరు. చకచకా కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలను కలిపి ఫోటోలు తీసి వీలైతే వాటికి కాస్త మసాలా జోడించి కట్టుకధలు అల్లీ మీడియాలో ప్రచురించేసే ప్రమాదం ఉంటుంది. దాని వలన కాంగ్రెస్ నేతలకే తప్ప టిఆర్ఎస్ నేతలకు ఎటువంటి నష్టమూ ఉండబోదు. ఎందుకంటే టిఆర్ఎస్‌తో కుమ్మక్కు అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే తప్ప టిఆర్ఎస్ కాదు కనుక!
అందుకే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ యశ్వంత్ సిన్హా ముందుగా మావద్దకు వచ్చి మమ్మల్ని కలిసిన తరువాత కేసీఆర్‌ను కలవాలనుకొన్నా లేదా కేసీఆర్‌ను కలిసిన తరువాత మమ్మల్ని కలవాలనుకొన్నా మేము మాత్రం ఆయనను కలవదలచుకోలేదు. దీని వలన ప్రజలలో అనవసరమైన అపోహలు ఏర్పడుతాయి,” అని అన్నారు. తమ అధిష్టానం మద్దతు ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా యశ్వంత్ సిన్హాను వెళ్ళి కలవలేని విచిత్రమైన పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొంటోంది.