రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, బిజెపియేతర, కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ద్రౌపది ముర్ముకి దేశవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు మద్దతు పలకడంతో ఆమె నామినేషన్ వేయకమునుపే విజయం ఖాయం అయిపోయింది.
కనుక ఆమె చేతిలో ఓడిపోబోతున్నారని తెలిసీ యశ్వంత్ సిన్హాకు సిఎం కేసీఆర్ మద్దతు పలకడం, ఆయన నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్‌ను పంపించడం, రేపు హైదరాబాద్ వచ్చి తనను కలవబోతున్న ఆయనకు చాలా అట్టహాసంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తుండటం అన్నీ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
ఒకవేళ యశ్వంత్ సిన్హా గెలుస్తారనే చిన్న నమ్మకం ఉన్నా కేసీఆర్ ఎంత హడావుడి చేసినా ఎవరికీ ఆశ్చర్యం కలిగదు. కానీ ఓడిపోబోయే అభ్యర్ధికి అదీ... తాను అసహ్యించుకొనే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిని ఇంత ప్రాధాన్యం ఇస్తుండటం చాలా విచిత్రంగానే ఉంది.
అయితే సిఎం కేసీఆర్ ఏమి చేసినా చాలా దూరం ఆలోచించి చేస్తారని తెలుసు. కనుక యశ్వంత్ సిన్హాకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి చాలా బలమైన కారణమే ఉండవచ్చు.
త్వరలో జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్న సిఎం కేసీఆర్ ఇప్పటికే ఉత్తరాదిలో ఢిల్లీ, పంజాబ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దోస్తీ ఏర్పరచుకొన్నారు. రైతుసంఘాల నాయకుడు తికాయత్, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్, సినీ నటుడు ప్రకాష్ రాజ్, యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వంటి పలువురు ప్రముఖులతో బలమైన స్నేహ సంబంధాలు ఏర్పరచుకొన్నారు.
అలాగే ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు, గాల్వాన్ లోయలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు సిఎం కేసీఆర్ స్వయంగా ఆర్ధికసాయం అందజేయడం అక్కడి ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని, వారి అభిమానం, గుర్తింపు సంపాదించుకొనే ప్రయత్నాలే అని చెప్పవచ్చు.
యశ్వంత్ సిన్హా గతంలో బిజెపిలో ఉన్నప్పుడు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ కారణంగా ఉత్తరాది ప్రజలకు ఆయన చిరపరిచితులు. ఆయన బిహారుకు చెందినవారు కనుక ఆ రాష్ట్రంలో కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. కనుక ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలలో ఆయన ఓడిపోయినప్పటికీ, రేపు కేసీఆర్ జాతీయపార్టీ స్థాపించి జాతీయ రాజకీయాలలో ప్రవేశించినప్పుడు, యశ్వంత్ సిన్హా వంటి నేతలందరి సహాయసహకారాలు చాలా అవసరం. బహుశః అందుకే ఆయనకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని భావించవచ్చు.