మహా రాజకీయాలలో మహా ట్విస్ట్!

July 01, 2022


img

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేసిన బిజెపి అధికారం చేపట్టడానికి సిద్దమైంది. శివసేన ప్రభుత్వాన్ని కూల్చివేసి తాము అధికారంలోకి రావడానికి సహకరించిన రెబెల్ మంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, తాము ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని బిజెపి మొదట భావించింది. కనుక మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా, ఏక్‌నాథ్ షిండేను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలనుకొంది. 

కానీ చివరి నిమిషంలో బిజెపి అనూహ్యమైన నిర్ణయం తీసుకొంది. ఏక్‌నాథ్ షిండేకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉపముఖ్యమంత్రి పదవితో సరిబెట్టుకొంది. గురువారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి వారిరువురి చేత ప్రమాణస్వీకారం చేయించారు.   

ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలలో ఈవిదంగా ప్రభుత్వాలను కూల్చివేసి అపఖ్యాతి మూటగట్టుకొన్న బిజెపి, మహారాష్ట్రలో కూడా శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని తామే కూల్చివేశామనే అపవాదు తమపైకి రాకుండా ఉండేందుకే ఈవిదంగా చేసింది.  

తద్వారా శివసేనలో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఆ పార్టీలో తిరుగుబాటు వర్గమే మహారాష్ట్రలో అధికారం చేపట్టిందని, వారి ప్రభుత్వానికి తాము కేవలం మద్దతు ఇస్తున్నామని ప్రజలకు చెప్పుకొనేందుకు ఈవిదంగా చేసింది. దీంతో ఎవరూ తమను వేలెత్తి చూపలేరని బిజెపి భావిస్తోంది. 

అదీగాక.. మహారాష్ట్రలో శివసేనకు విస్తృతమైన క్యాడర్, ప్రజల మద్దతు ఉంది. శివసేన ప్రభుత్వాన్ని కూల్చివేసినందుకు ప్రజలు బిజెపిపై ఆగ్రహంగా ఉంటారని గ్రహించింది. కనుక శివసేన ప్రభుత్వాన్ని కూల్చివేసిన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెడితే, ప్రజాగ్రహం చల్లారుతుంది లేదా ఆయనపైకి మళ్ళుతుంది లేదా ఆయనే ప్రజలను శాంతింపజేసుకొంటారనే దురాలోచన కూడా కనబడుతోంది. 

అయితే ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినప్పటికీ అధికారం అంతా బిజెపి చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే బిజెపి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నంతకాలమే ఆయన ఆ కుర్చీలో కూర్చోగలరు కనుక! ఒకవేళ రాష్ట్రంలో బిజెపికి అనుకూలంగా పరిస్థితులు మారినట్లయితే ఏక్‌నాథ్ షిండేను కొనసాగిస్తుంది లేదా ఏదో వంకతో మద్దతు ఉపసంహరించుకొని పక్కకు తప్పుకొంటుంది. అంటే ఏవిదంగా చూసినా చివరికి నష్టపోయేది ఏక్‌నాథ్ షిండే అని అర్దం అవుతోంది. 

శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు ఇంతకంటే ఎక్కువ గౌరవం లభించేది. కానీ బిజెపి విసిరిన ఉచ్చులో చిక్కుకొని ముఖ్యమంత్రి అవుతున్నప్పటికీ ఆయన మునుపటి గౌరవం పొందలేరు. పైగా ఇటు బిజెపి కర్ర పెత్తనాన్ని భరిస్తూ, అటు శివసేన, మహారాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని భరిస్తూ నెగ్గుకు రావలసి ఉంటుంది లేకుంటే ఆయన రాజకీయ జీవితం ఇక్కడితో సమాప్తమైపోవచ్చు.


Related Post