అగ్నిపథ్‌ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు

June 29, 2022


img

త్రివిద దళాలలో నాలుగేళ్ళ కాలపరిమితో ఉద్యోగాలకు కేంద్రప్రభుత్వం అగ్నిపథ్‌ అనే కొత్త విధానం అమలులోకి తెచ్చింది. ఈ విధానానికి దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నిరసనలు తెలియజేసి ఆందోళనలు చేసినప్పటికీ, కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. భారత వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాల కోసం ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించగా ఇప్పటి వరకు 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయని వాయుసేన అధికారులు మీడియాకు తెలిపారు. జూలై 5 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కనుక ఆలోగా మరో లక్ష దరఖాస్తులు వచ్చినా ఆశ్చర్యం లేదు. 

అగ్నిపథ్‌ విదానం ద్వారా తొలి బ్యాచ్‌లో త్రివిద దళాలలో కలిపి మొత్తం 46,000 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అయితే ఒక్క వాయుసేనకే ఏకంగా 1.83 లక్షల దరఖాస్తులు వచ్చినందున, ఈ ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత దీనిని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, వేరే గత్యంతరం లేదు కనుక ఈ అవకాశాన్ని జారవిడుచుకోవడం ఇష్టం లేక దరఖాస్తు చేస్తున్నట్లు భావించవచ్చు. ఒకవేళ ఈ ఉద్యోగాలకు ఎంపికైతే కనీసం నాలుగేళ్ళు సర్వీసు, నెలనెలా ఎంతోకొంత ఆదాయం వస్తుందనే ఆలోచనతో అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకొంటున్నట్లు భావించవచ్చు. అయితే ఈ 46,000 ఉద్యోగాలకు కూడా గట్టి పోటీ ఉంటుందని స్పష్టమవుతోంది. 

అగ్నిపథ్‌ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ అగ్నిపథ్‌ ఉద్యోగాలకు ఈ స్థాయిలో స్పందన వస్తున్నందున సుప్రీంకోర్టు కూడా అగ్నిపథ్‌ను సమరించవచ్చు. ఇక దేశంలో విపక్షాలు అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ దానిని అడ్డుకోలేవు కానీ ఎన్నికలలో ఇదే అంశాన్ని ప్రస్తావించి అగ్నిపథ్‌తో తీవ్ర అసంతృప్తిగా ఉన్న యువత ఓట్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేయవచ్చు. అయితే అగ్నిపథ్‌కు భారీగా స్పందన వస్తోంది కనుక బిజెపి  కూడా గట్టిగానే సమర్దించుకొనేందుకు అవకాశం లభించింది. 


Related Post