చేవెళ్ళ మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి జూలై 1వ తేదీన ఢిల్లీకి వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఆయన 2013లో కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కానీ సిఎం కేసీఆర్ నిరంకుశ, అప్రజాస్వామిక వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 2018లో టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొలేకపోతోందని చెపుతూ ఆ పార్టీకి ఏడాదిపాటు దూరంగా ఉన్నారు. ఏ పార్టీ అయితే సిఎం కేసీఆర్‌ను ఢీకొని ఓడించగలదో ఆ పార్టీలో చేరుతానని కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు.
ఆయనను పార్టీలో నిలుపుకొనేందుకు కాంగ్రెస్ నేతలు, బిజెపిలోకి ఆకర్శించేందుకు ఆ పార్టీ నేతలు చాలా ప్రయత్నించారు కానీ ఇంతకాలం ఆయన తటస్థంగానే ఉండిపోయారు. ఇప్పుడు ఆయనకి బిజెపిపై నమ్మకం ఏర్పడిందో లేదా వచ్చే ఎన్నికలలో టికెట్ కావాలంటే ఇప్పుడే పార్టీలో చేరడం అవసరమనుకొన్నారో తెలీదు కానీ బిజెపిలో చేరేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన బిజెపిలో చేరితే చేవెళ్ళలో టిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తారు కనుక ఆ పార్టీకి చాలా నష్టమే.