సిఎం కేసీఆర్ దాదాపు తొమ్మిది నెలల తరువాత ఇవాళ్ళ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చారు. గత తొమ్మిది నెలలుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని పలకరించకుండా, ఆమెపై పార్టీ నేతల చేత విమర్శలు చేయిస్తున్నందున ఇవాళ్ళ రాజ్‌భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సిఎం కేసీఆర్ వస్తారా రారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సిఎం కేసీఆర్ తన మంత్రులు, ముఖ్యనేతలను వెంటబెట్టుకొని రాజ్‌భవన్‌కు వెళ్ళడమే కాకుండా, అసలు ఏమీ జరగనట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో చిర్నవ్వులు చిందిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె కూడా భేషజాలకు పోకుండా హుందాగా సిఎం కేసీఆర్‌తో మాట్లాడారు. ఇరువురు ఒకరికొకరు పూల బొకేలు ఇచ్చుకొన్నారు. జస్టిస్ భుయాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తరువాత సిఎం కేసీఆర్, తమిళిసై సౌందరరాజన్, జస్టిస్ భుయాన్ టీ త్రాగుతూ కొంతసేపు కబుర్లు చెప్పుకొన్నారు. తరువాత సిఎం కేసీఆర్ గవర్నర్ వద్ద సెలవు తీసుకొని ప్రగతి భవన్‌కు వెళ్ళిపోయారు.
సిఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మళ్ళీ మర్యాదపూర్వకంగా మాట్లాడారు కనుక ఇకపై ఆమెతో యుద్ధం నిలిపివేస్తారా లేదా ఆమెను కూడా బిజెపి నేతగా జమకట్టినందున యుద్ధం కొనసాగిస్తారా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.