దామెర రాకేష్‌ సోదరుడికి ఉద్యోగం..జైల్లో ఉన్న యువకులు క్షమార్హులు కారా?

June 25, 2022


img

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో పోలీసుల కాల్పులలో వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేష్‌ అనే యువకుడు మరణించగా, సిఎం కేసీఆర్‌ అతని కుటుంబానికి రూ.25 లక్షల ఆర్ధికసాయం, అతని కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తానని ప్రకటించారు. దామెర రాకేష్‌ కుటుంబ సభ్యులు మృతుడి సోదరుడు దామెర రామ్ రాజుకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఆ ప్రకారం సిఎం కేసీఆర్‌ అతనికి వరంగల్‌ జిల్లాలోనే ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు. ఈమేరకు ఆయన వరంగల్‌ జిల్లా కలెక్టర్‌కు వ్రాసిన ఓ లేఖలో దామెర రామ్ రాజు విద్యార్హతలకు తగిన ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. 

చిన్న వయసులోనే దామెర రాకేష్‌ పోలీసుల కాల్పులలో మరణించడం చాలా బాధాకరం. ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఈవిదంగా ఆదుకోవడం చాలా అభినందనీయం. కానీ ఈ అల్లర్లలో అరెస్ట్ అయిన మిగిలిన యువకుల పట్ల కూడా ప్రభుత్వం మానవతాదృక్పదంతో క్షమించి విడిపించాల్సిన అవసరం ఉంది. ఆ యువకులు అందరూ కూడా 19-22 ఏళ్ల లోపు వయసున్నవారే. ఎవరో రెచ్చగొట్టడం వలన ఆవేశంతో ఈ పొరపాటు చేశారు తప్ప వారిలో ఎవరూ క్రిమినల్ కాదు. ఎవరికీ అటువంటి ఆలోచన కూడా లేదు. 

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న యువకులందరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. అందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన బడుగుబలహీన వర్గాలకు చెందిన యువకులే. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయశాఖ, పార్లమెంటు కలిసి వారికి క్షమాభిక్ష పెట్టి విడిపించడం చాలా అవసరం. లేకుంటే ఇప్పుడే ఆరంభమైన వారి జీవితాలు జైళ్ళలోనే ముగుస్తాయి. ఒకవేళ 10-15 ఏళ్ళు  జైలు శిక్ష అనుభవించి బయటకువచ్చినా అప్పటికే సగం జీవితం గడిచిపోతుంది కనుక ఇక వారు చేయగలిగేది ఏమీ ఉండదు. తమ జీవితం నాశనం అయిపోయినందుకు అప్పుడు వారు సమాజం మీద ద్వేషం పెంచుకొని అసాంఘికశక్తులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.


Related Post