టీచర్ల ఆస్తులు ప్రకటించాలి... ఇవేమి ఉత్తర్వులు?

June 25, 2022


img

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈరోజు చాలా వివాదాస్పదమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా ప్రతీ ఏడాది తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తుండాలని ఆదేశించింది. అలాగే స్థిర, చరాస్తులు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొంది. 

ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలంలోని గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ అలీ విధులకు హాజరుకాకుండా స్థిరాస్తుల వ్యాపారం చేసుకొంటున్నట్లు ఆరోపణలు రావడంతో విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఆ ఆరోపణలు నిజమని దృవీకరించడంతో విద్యాశాఖ అప్రమత్తమై ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే రాష్ట్రంలో ఉపాధ్యాయులందరినీ అనుమానించడం సరికాదు. ఉపాధ్యాయులు ప్రతీ ఏడాది తమ స్థిర, చరాస్తుల వివరాలు ప్రకటించమని కోరడం, వాటి కొనుగోలుకు ముందు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించడం రెండూ కూడా చాలా వివాదాస్పదమైనవే అని చెప్పవచ్చు. పైగా స్థిర, చరాస్తుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించడం కూడా సరికాదు. 

ఒకవేళ ఉపాద్యాయులు ఓ కారు లేదా స్కూటీ, బైక్‌ లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవలసివస్తే పరిస్థితి ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఉపాధ్యాయులను అవమానించడమే అవుతుంది. 

ఒకవేళ ఉపాధ్యాయులందరూ సైడ్ బిజినెసులు చేసుకొంటున్నారని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, ప్రభుత్వోద్యోగులందరినీ కూడా అనుమానించవలసి ఉంటుంది. కనుక వారికి కూడా ఈ ఆంక్షలు అమలుచేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో అందరికీ తెలుసు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులపై ఉపాధ్యాయుల స్పందన ఏవిదంగా ఉంటుందో రేపటి నుంచి చూడవచ్చు. కనుక అటువంటి విమర్శలు ఎదుర్కోక మునుపే ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేస్తే మంచిదేమో?


Related Post