కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి వస్తే 50 రాష్ట్రాలు ఏర్పాటు!

June 25, 2022


img

కర్ణాటకలో అధికార బిజెపి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి చెప్పిన ఓ విషయం సంచలనం సృష్టిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి గెలిచి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఉన్న 28 రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలను విభజించి మొత్తం 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆలోచిస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ చాలా కాలంగా మేధావులు, సబందిత వర్గాలతో చర్చిస్తున్నారని చెప్పారు. 

కర్ణాటక రాష్ట్రాన్ని ఉత్తర, దక్షిణ కర్ణాటక రాష్ట్రాలుగా విభజిస్తారని, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా, మహారాష్ట్రని మూడు రాష్ట్రాలుగా విభజిస్తారని మంత్రి ఉమేష్ కత్తి తెలిపారు. గత ఆరు దశాబ్ధాలలో కర్ణాటకలో జనాభా 3-4 రెట్లు పెరిగిందని కనుక కర్ణాటకను రెండుగా విభజించడం మంచిదే అని అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ కన్నడిగులు అందరూ అన్నదమ్ములా కలిసే ఉండవచ్చని మంత్రి ఉమేష్ కత్తి అన్నారు. 

దీనిపై కర్ణాటక మాజీ సిఎం సిద్ద రామయ్య స్పందిస్తూ, “రాష్ట్రాన్ని విభజించాలనే బిజెపి ఆలోచన చాలా ప్రమాదకరమైనది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. బిజెపి చేస్తున్న ఈ ఆలోచన వారి ప్రభుత్వంలో మంత్రి ఉమేష్ కత్తి బయటపెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలి,” అని ట్వీట్ చేశారు. 

కర్ణాటక సిఎం బసవరాజు బొమ్మై దీనిపై స్పందిస్తూ, “మంత్రి ఉమేష్ కత్తి చాలా కాలంగా రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇది కూడా అటువంటిదే తప్ప మరోటి కాదు. దీనిపై ఆయనే సమాధానం చెప్పుకోవాలి. దీంతో పార్టీకి, ప్రభుత్వానికి సంబందం లేదు,” అని బదులిచ్చారు.


Related Post