ఈటలను కట్టడి చేసేందుకు టిఆర్ఎస్‌ ప్రయత్నం?

June 25, 2022


img

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న హుజూరాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను టిఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది. ఆయన కుటుంబం కబ్జా చేసిన 70.33 ఎకరాల  అసైన్డ్ భూములను తమకు తిరిగి ఇవ్వాలని కోరుతూ  అచ్చంపేట గ్రామ సర్పంచ్ రాంచందర్ అధ్వర్యంలో శుక్రవారం హక్కింపేట, అచ్చంపేట, ధర్విపల్లి గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ర్యాలీ నిర్వహించి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌ రమేష్‌కు వినతి పత్రం ఇచ్చారు. 

అనంతరం వారు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డిని కలిసి తమ భూములు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన స్పందిస్తూ తక్షణం ఈ విషయాన్ని సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళి భూములు తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

పైకి ఇది రైతులు ధర్నా కార్యక్రమంలాగే కనిపిస్తున్నప్పటికీ వారిని టిఆర్ఎస్‌ పార్టీయే ప్రోత్సహించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే, ఇన్ని నెలలుగా ఆ భూముల ఊసు ఎత్తని ఆ రైతులు, మరో వారం రోజులలో హైదరాబాద్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ముందు హటాత్తుగా ఫ్లెక్సీ బ్యానర్లు అచ్చు వేయించుకొని వచ్చి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం, ఈ అసైన్డ్ భూముల కేసు హైకోర్టులో ఉందని తెలిసి ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని రైతులకు తిరిగి ఇప్పిస్తానని హామీ ఇవ్వడం చూస్తే టిఆర్ఎస్‌ పార్టీ ఈటల రాజేందర్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సందేహం కలుగుతోంది. మరి ఈ తాజా పరిణామాలపై ఆయన ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.


Related Post