సిఎం కేసీఆర్‌ ప్రజలను పట్టించుకోలేదు అందుకే...

June 23, 2022


img

మాజీ కాంగ్రెస్‌ నేత, దివంగత పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి గురువారం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ టిఆర్ఎస్‌ కార్పొరేటర్‌గా ఉన్న ఆమె హటాత్తుగా టిఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆశ్చర్యకరమే. 

అయితే ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకొన్నది కాదని ఆమె చెప్పారు. సిఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా జాతీయ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు, పింఛనుల కోసం పేద ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూపులు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె అన్నారు. 

ఇటీవల హైదరాబాద్‌ నడిబొడ్డున మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తనను చాలా కలచివేశాయని విజయారెడ్డి అన్నారు. షీ టీమ్స్, సీసీ కెమెరాలు, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ నేర నియంత్రణ చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నా రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజల బాగోగులు గురించి ఆలోచించకుండా సిఎం కేసీఆర్‌ రాజకీయాలకే పరిమితం అవుతుండటం చూసి తాను చాలా ఆవేదనతో పార్టీని వీడుతున్నానని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెంది మళ్ళీ శాంతి సమరస్యాలు ఏర్పడుతాయనే నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని విజయారెడ్డి చెప్పారు.            

ఆమె పార్టీ వీడటానికి చెప్పిన కారణాలు, అసలు కారణాలు వేరని రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారందరికీ తెలుసు. వచ్చే ఎన్నికలలో ఆమె ఖైరతాబాద్ నుంచి శాసనసభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే టిఆర్ఎస్‌లో దానం నాగేందర్ ఆ సీటును వదులుకోరు కనుక టిఆర్ఎస్‌ పార్టీలో ఉండగా తన కల నెరవేరదు. బహుశః రేవంత్‌ రెడ్డి ఆమెకి ఖైరతాబాద్ సీటుకి హామీ ఇచ్చి ఉండవచ్చు. అందుకే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండవచ్చు. 


Related Post