సిఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీస్ జారీ

June 23, 2022


img

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. బంజారాహిల్స్‌లో టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం కొరకు 4,935 గజాల స్థలాన్ని కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహేశ్వర్ రాజ్‌ అనే రిటైర్డ్ ఉద్యోగి హైకోర్టులో ప్రజాహిత ప్రయోజన పిటిషన్‌ వేశారు. దానిలో ప్రతివాదులుగా సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, సీసీఎల్ఏలను పేర్కొనడంతో హైకోర్టు వారందరికీ నోటీసులు జారీ చేసి నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

బంజారాహిల్స్‌లో కోట్లు విలువ చేసే అత్యంత ఖరీదైన భూమిని ముఖ్యమంత్రి హోదాలో సిఎం కేసీఆర్‌ తన పార్టీకి కేవలం రూ.100లకే కేటాయించుకొన్నారని, ఇది తన పదవి, అధికారాలను దుర్వినియోగం చేయడమే అని  పిటిషనర్‌ పేర్కొన్నారు. కనుక టిఆర్ఎస్‌ పార్టీకి కేటాయించిన భూమిని తక్షణం వెనక్కు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్ధించారు. 

అయితే ఒక్క హైదరాబాద్‌లోనే కాదు మిగిలిన 32 జిల్లాలలో కూడా ఒక్కో జిల్లాలో మూడెకరాల చొప్పున మొత్తం 96 ఎకరాలు టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాలకు కేటాయించుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించవలసిన పాలకులే తమ రాజకీయ పార్టీలకు ఈవిదంగా అప్పనంగా భూములు కేటాయించుకోవడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. 

టిఆర్ఎస్‌ పార్టీ వద్ద సుమారు రూ.900 కోట్లు పైనే సొమ్ము ఉందని తమది చాలా ధనికపార్టీ అని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. అటువంటప్పుడు మార్కెట్‌లో రేట్ ప్రకారం భూమికి డబ్బు చెల్లించి తీసుకొని ఉంటే ఎవరూ ఈవిదంగా వేలెత్తి చూపేవారు కాదు. ఇటువంటి కేసులో హైకోర్టు ముఖ్యమంత్రికి నోటీస్ జారీ చేయడం కూడా చాలా అప్రదిష్టకరమైనదే.


Related Post