వాహ్ మోడీజీ... మద్దతు ఇవ్వక చస్తామా?

June 22, 2022


img

భారత్‌ రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ విపక్షాలకు బలం లేకపోయినా కేవలం ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలపై అక్కసుతో శరత్ పవర్ తదితరులను బకరాగా నిలబెట్టేందుకు ప్రయత్నించి, చివరికి యశ్వంత్ సిన్హాను నిలబెట్టాయి. పోటీ అనివార్యం అయ్యింది కనుక ఎన్నికలు అనివార్యం అయ్యాయి. 

ఎన్డీయే అభ్యర్ధిగా ఒడిశాలో మారుమూల కుగ్రామం నుంచి ఝార్ఖండ్ గవర్నర్‌ స్థాయికి ఎదిగిన ద్రౌపది ముర్ముని ఎన్డీయే అభ్యర్ధిగా నిలబెట్టింది. ఆమెను గెలిపించుకోవాలంటే బిజెపికి బయట పార్టీల నుంచి మరొకటిన్నర శాతం ఓట్లు పడితే చాలు. కనుక వివిద పార్టీలతో మంతనాలు చేసింది కూడా. అయితే ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. 

తమ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ముని ఎంచుకోవడంతోనే దేశంలో అన్ని పార్టీలు ఆమెకే మద్దతు పలికేలా చేస్తోంది. ఆమె ఒడిశాకు చెందినవారు కనుక ఒడిశాలోని అధికార బిజెడి మద్దతు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఝార్ఖండ్ గవర్నర్‌గా ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌తో సత్సంబందాలు కలిగి ఉన్నందున ఝార్ఖండ్ ముక్తి మోర్చా మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. ఆమె ఆదివాసీ మహిళ కనుక దేశంలో బడుగు బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నా పెద్దా పార్టీలు, అలాగే వివిద ప్రాంతీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. 

చివరికి బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే సిఎం కేసీఆర్‌, మమతా బెనర్జీ, అరవింద్‌  కేజ్రీవాల్‌ వంటివారు సైతం ఆమె అభ్యర్ధిత్వాన్ని బలపరచక తప్పని పరిస్థితి కల్పించింది బిజెపి. కనుక ద్రౌపది ముర్ముని గెలిపించుకోవడానికి ఇప్పుడు బిజెపి ఏమాత్రం శ్రమించనవసరం లేదు. ఇతర పార్టీలే ఆమెను భారీ మెజార్టీతో గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తాయి. ఇటువంటి గొప్ప వ్యూహంతో ప్రతిపక్షాలను ఎన్నికలకు ముందే చిత్తుచిత్తు చేసిన క్రెడిట్ ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకే దక్కుతుంది అని చెప్పక తప్పదు. 


Related Post