సిఎం కేసీఆర్‌ చేతులు కట్టేసిన బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు!

June 22, 2022


img

రాష్ట్రపతి ఎన్నికల గురించి సిఎం కేసీఆర్‌ ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోంది. ఈ ఎన్నికలను అవకాశంగా మలుచుకొని దేశంలో విపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిని నిలబెట్టాలనుకొన్నారు. ఆయన తలచినట్లే బిజెపియేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.. యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాయి కానీ కేసీఆర్‌ అభిమతానికి విరుద్దంగా కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకోవడంతో వాటికి దూరంగా ఉండిపోవలసివచ్చింది. అయినా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇద్దామనుకొంటే ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముని నిలబెట్టింది. తద్వారా సిఎం కేసీఆర్‌ ఆమెను కాదని యశ్వంత్ సిన్హాకు ఓటువేయలేని పరిస్థితి బిజెపి కల్పించిందని చెప్పవచ్చు. టిఆర్ఎస్‌ మద్దతు కోరకుండానే తప్పనిసరిగా తమ అభ్యర్ధికి మద్దతు ఇచ్చేలా చేయించడం గొప్ప విషయమే కదా? 

దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకి లభిస్తుంది కనుక ఆమెకు టిఆర్ఎస్‌ మద్దతు ఇద్దామనుకొంటే తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు ఊరుకోరు. వెంటనే టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే తమ వాదన దీంతో మరోసారి రుజువైందని విమర్శించడం మొదలుపెడతారు. 

ఒకవేళ యశ్వంత్ సిన్హాకు టిఆర్ఎస్‌ మద్దతు ఇస్తే అప్పుడు తెలంగాణలో బిజెపి నేతలు ఊరుకోరు. సిఎం కేసీఆర్‌ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమని, వారు ఉన్నత పదవులు అధిష్టించడం సిఎం కేసీఆర్‌కు ఇష్టం ఉండదని అందుకే ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వలేదని ప్రచారం మొదలుపెట్టేస్తారు.  

కనుక బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి రాష్ట్రపతి ఎన్నికలను సిఎం కేసీఆర్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మార్చాయి. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకొంటారో చూడాలి.


Related Post