మహా ప్రభుత్వం కూల్చివేతకు రంగం సిద్దం

June 22, 2022


img

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ఉంది. శివసేన సీనియర్ నేత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సుమారు 15-20 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌ నగరానికి వెళ్ళిపోవడంతో ఈ మహా సంక్షోభం మొదలైంది. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మిగిలిన తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రహస్య ప్రదేశాలకు తరలించి కాపాడుకొంటున్నాయి. 

ఏక్‌నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని బిజెపి పాలిత గుజరాత్‌లో మకాం వేయడం, ఆయన కలిసివస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపి సిద్దంగా ఉందని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రకటించడం ఈ మహా కుట్ర వెనుక బిజెపి హస్తం ఉందనే అనుమానాలను దృవీకరిస్తున్నట్లయింది. 

మహారాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం 288 స్థానాలకు గాను 287 మంది ఉన్నారు. వారిలో శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ పార్టీకి 44 కలిపి మొత్తం 152 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్ర అభ్యర్ధులు, చిన్న పార్టీలకు చెందిన మరో 15 మంది ఎమ్మెల్యేలు వారి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. వారితో కలిపి మొత్తం 167 మంది ఉన్నారు. 

మరో పక్క బిజెపికి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్ర అభ్యర్ధులు, చిన్న పార్టీలకు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి బిజెపి కూటమి బలం 116గా ఉంది. 

ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 144 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒకవేళ శివసేన కూటమిలో 167 మంది ఎమ్మెల్యేలలో   ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు బయటకు జారుకొంటే ప్రభుత్వం పడిపోతుంది. ఏక్‌నాథ్ షిండే వెంట సుమారు 15-20 మంది ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. 

కనుక శివసేన కూటమికి మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్ధులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇదే అదునుగా బిజెపితో చేతులు కలపవచ్చు. కనుక ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. వెంటనే బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చు. 


Related Post